- గాంధీజీ పాదయాత్ర ద్వారనే బ్రిటీష్ వారితో పోరాడారు
- ప్రజలతో మమేకమయ్యేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు
- ఏఐసీసీ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్
ఆర్మూర్, బతుకమ్మ : స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో గాంధీజీ పాదయాత్ర ద్వారా రవి అస్తమించని బ్రిటీష్ పాలకులను గడ గడలాడించారు. గాంధీజీ, వినో బావేల స్పూర్తితో దేశంలో జరుగుతున్న మత, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని , భవిష్యత్తులో చేస్తారని ఎఐసీసీ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ అన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా అర్గుల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షీ నటరాజన్ మాట్లాడుతు.. 2022 లో జిల్లాలో సర్వోధయ యాత్రలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. ఆనాడు కలువని నాయకులు, కార్యకర్తలను జనహిత పాధయాత్రలో కలవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలతో మమేకం కావడానికి వారి కష్ట సుఖాలను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసారని అన్నారు. అది ఆగిపోలేదని వాన కాలం, ఎండకాలం, చలికాలంలో సాగిందని మున్ముందు సాగుతుందని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో వెనుకబడిపోలేదని ఆయన నడక నిరంతరం అని గుర్తు చేశారు. సోనియాగాంధీ ప్రధాన మంత్రి పధవిని తిరస్కరించడం ద్వార కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మార్గం చూపారని అన్నారు. అది భారత దేశంలో సంప్రదాయంగా వస్తున్న త్యాగం అని అన్నారు. దానిని రాహుల్ గాంధీ ప్రతి సంధర్బంలో చెబుతారని అన్నారు. జై బాపు, జై భీం, జై సంవిదాన్ అనే కార్యక్రమం అందులో భాగమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి పధవులు వస్తాయని, అధికార వస్తుందని, ధనవంతులు అవుతారని హామీ ఇవ్వదని దేశంలో ఎక్కడ తిరిగిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మాత్రం ఉంటారని హామీ ఇస్తుందని మీనాక్షి నటరాజన్ అన్నారు.

- కుల గణనలో దేశానికి తెలంగాణనే రోల్ మాడల్..
దేశంలో ఎక్కడకు వెళ్లిన రాహుల్ గాంధీ తెలంగాణ గురించే మాట్లాడుతారని మీనాక్షీ నటరాజన్ అన్నారు. శాస్త్రీయంగా జనాభా ఎంత ఉంది, వారిలో ఎంతమంది వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు. ఇప్పటి వరకు వారికి ప్రభుత్వాల ద్వారా అందిన వారి లెక్కలు తీసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ల అమలుకు తీసుకుంటున్న చర్యలు దేశానికి రోల్ మాడల్ అని అన్నారు. దేశంలో జరిగిన కుల గణనను తెలంగాణలో జరిగిన కుల గణనను పరిశీలిస్తే ఎవ్వరు వెనుకబడి ఉన్నారో స్పష్టం అవుతుందని అన్నారు. దేశంలో ఐకమత్యం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహిస్తే అది గాంధేయ వాదంలో సాగుతుంటే అధికార బీజేపీ పార్టీకి నచ్చడం లేదని అన్నారు. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రిజర్వేషన్ ల అమలు విషయం కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టిన అమలు చేసి తీరుతామని అన్నారు. డిల్లీలో జరిగే నిరసనకు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ధ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సత్యం , అహింస, ధర్మం బోధించిన నేలపై ఎందరో మహా మహులు ప్రేమ, ఐక్యతకోసం పాటు పడ్డారని వారు చూపిన దారిలోనే కాంగ్రెస్ నడుస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని దేశం విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో నుంచి విముక్తి కలిగించాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు 80శాతం అమలు అయ్యాయన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ ద్వారా ప్రజలతో మమేకమవుతూ వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించి కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకే జనహిత పాదయాత్ర అని అన్నారు.

