బతుకమ్మ, బాన్సువాడ : ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. శుక్రవారం బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఆస్తి సంబంధిత నేరాలపై సిబ్బందితో సమీక్షించారు. ముందుగా రోల్ కాల్‌ను పరిశీలించి, హాజరు, గైర్హాజరైన సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ఫిర్యాదులపై తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతీ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ అన్నిరకాల విధులను తెలుసుకుని ఉండాలని, మారుతున్న సమాజానికి అనుగుణంగా, ఎలాంటి విధులనైనా చేయగలిగే విధంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. పాత నేరస్తులపై నిరంతర నిఘా, నైట్ బీట్ , పెట్రోలింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. నేరాల నివారణ, చేధనకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. భారీగా వర్షాలు కూసున్న నేపథ్యంలో బాన్సువాడ ట్యాంక్‌బండ్, మంజీర డ్యాంను పరిశీలించారు. వాగులు, వంతెనలు దాటి ప్రయాణించవద్దని, సెల్ఫీలు తీసుకోవడం.. చేపల వేటకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ విట్టల్ రెడ్డి, సీఐలు అశోక్, తిరుపతయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
