24 C
Hyderabad
Sunday, August 2, 2026

పదోన్నతి వస్తుందా.. రాదా..?

Must read

📰 Generate e-Paper Clip

  • 10 నెలల్లోనే 35 మందికి రివర్షన్
  • డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటుతో ఆందోళనలో రివర్షన్ ఉద్యోగులు

 

నిజామాబాద్, బతుకమ్మ : పది నెలల క్రితం వరకు వారు ఉన్నత ఉద్యోగులు. కానీ డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటుతో వారు జూనియర్ ఉద్యోగులయ్యారు. దాంతో డివిజన్ ఏర్పాటు దాని పదోన్నతికి ఎసరు తెచ్చిందని కొందరు ఉద్యోగులు ఆందోళన చెందుతుండగా, మరికొందరు మాత్రం దశాబ్ధాల కల నెరవేరిందని సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ విద్యుత్ శాఖలో ఇటీవల ఏర్పాటయిన డిచ్ పల్లి డివిజన్ ఉద్యోగుల భవితవ్యాన్ని మార్చేవేసింది. కుడి చేత్తో పదోన్నతి ఇచ్చారు… పట్టుమని పది నెలలు గడవకముందే . . .  ఎడమ చేత్తో లాక్కున్నారు. ప్రమోషన్ అనేది ఒక పీడ కలల మిగిలిపోయింది. డిచ్ పల్లి డివిజన్ కు సిబ్బంది కేటాయింపులో  అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పిన అధికారులు పదోన్నతి పొందినవారిని నట్టేట ముంచారనే ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ సర్కిల్ పరిధిలో 35 మందికి రివర్షన్ ఇచ్చి  విభజన ప్రక్రియను కొనసాగించారు. క్లారిఫికేషన్ (వివరణ) కోసం సిఎండి కి రాస్తున్నామని బదిలీలు పూర్తవగానే వెంటనే పదోన్నతులు ఇచ్చేస్తామని నమ్మబలికారు. తీరా యేరు దాటాక తెప్ప తగలబెట్టిన చందంగా కోర్ట్ లో దీనిపై కేసు నడుస్తున్నందున తీర్పు వెలువడ్డాకనే పదోన్నతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం గమనార్హం.

  • జాక్ అభ్యంతరం..

పదోన్నతి ఉద్యోగి హక్క.. వారికి రివర్షన్ జరగకుండా బదిలీలు జరపాలని, ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని  విద్యుత్ ఉద్యోగుల బృందం (జాక్) అభ్యంతరం వ్యక్తం చేసింది. రివర్షన్ జరిగినా నష్టం లేదు, విభజన జరగాల్సిందేనని ఒకరిద్దరు సంఘ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల  కోసం పట్టుబట్టినట్లు తెలిసింది. పది నెలల క్రితం పదోన్నతి పొందిన సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ నుంచి లైన్ ఇన్స్పెక్టర్ కు నలుగురు, లైన్ ఇన్స్పెక్టర్ నుంచి లైన్ మెన్ కు నిజామాబాద్ లో తొమ్మిది, ఆర్మూర్ లో ఐదు, లైన్ మెన్ నుంచి అసిస్టెంట్ లైన్ మెన్ గా నిజామాబాద్ లో 11, ఆర్మూర్ లో అరుగురికి వారి హోదాను తగ్గించి బదిలీ ప్రక్రియను చేపట్టారు.

  • విద్యుత్ శాఖలో రివర్షన్లపై జోరుగా చర్చ..

విద్యుత్ శాఖాపరంగా తప్పు చేసిన వారిపై విచారణ చేసి క్రమశిక్షణలో భాగంగా రివర్షన్ ఇవ్వడం ఆనవాయితీ. డివిజన్ ఏర్పాటుకు ముందే పదోన్నతులను పొందిన వారిని బలిపశువులను చేయడం చర్చనీయాంశంగా మారింది. పదోన్నతి పొంది పది నెలలుగా విధులు నిర్వహించినవారికి హఠాత్తుగా రివర్షన్ చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పలు యూనియన్ల లీడర్లు కింది స్థాయి ఉద్యోగులను ఆందోళన దిశగా రెచ్చగొడుతున్నట్లు సమాచారం. డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటు 2022లో పూర్తి కావాల్సి ఉండగా స్వార్థపరులైన యూనియన్ లీడర్ల కారణంగానే ఆలస్యమైందని విషయం వాస్తవమే. విద్యుత్ శాఖలో రివర్షన్ ల వ్యవహరంపై పైరవీలు జరుగుతున్నాయని త్వరలోనే యధాస్థానంలో  విధులు నిర్వహిస్తారని కొందరు ఇప్పటికే కింది స్థాయి ఉద్యోగులను మోసం చేస్తున్నారనే వాదనలున్నాయి.

More articles

Latest article