28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పడగల్ ‘సహకార’ కుంభకోణంపై విచారణ

Must read

📰 Generate e-Paper Clip


Investigation into the Padagal 'cooperation' scam

. పడగల్ సొసైటీలో రైతుల పేరుతో రుణాలు తీసుకున్న సెక్రెటరీ

. రుణమాఫీ ప్రక్రియతో వెలుగులోకి వచ్చిన వైనం

. సెక్రటరీ బదిలీపై వెళ్లిన తరువాత మోసపోయినట్లు తెలుసుకున్న రైతులు

వేల్పూర్, బతుకమ్మ: జిల్లా సహకార శాఖలో మరో కుంభకోణం వెలుగుచూసింది. పడగల్ సొసైటీ సెక్రటరీగా పని చేసి వెళ్లిన దయాసాగర్ తమ పేర్లపై రుణాలు తీసుకున్నాడని కోమన్ పల్లి, కుకునూర్, అంక్సాపూర్, పోచంపల్లి, హనుమాన్ నగర్ గ్రామాలకు చెందిన పలువురు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కో ఆపరేటీవ్ స్పెషల్ అధికారి మురళి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తాము రూ.50వేల చొప్పున రుణాలు తీసుకుంటే గతంలో పనిచేసిన సెక్రెటరీ దయాసాగర్ రూ.2లక్షల చొప్పున తీసుకున్నట్లు నమోదు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రూ.2లక్షల చొప్పున రుణాలు తీసుకున్నట్లు నోటీసులు వచ్చే వరకు తెలువదని వాపోయారు. తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించినప్పటికీ మళ్లీ బాకీ ఉన్నట్లు నోటీసులు వచ్చాయని మరికొంత మంది రైతులు తెలిపారు. కుకునూర్ కు చెందిన బక్కయ్యగారి రాజేశ్వర్ అనే రైతు తాను 9తులాల బంగారం తాకట్టుపెట్టి రూ.1,50,000 రుణం తీసుకున్నానని, 2018లో 1,90,000 కట్టానని తెలిపాడు. డబ్బులు తీసుకున్న సెక్రెటరీ బంగారు తీసుకువస్తానని చెప్పి ఇంత వరకు ఇవ్వలేదని ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా అధికారి మురళి మాట్లాడుతూ.. రైతుల నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు తీసుకుంటున్నామని, వాటిని పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

15 ఏళ్లు తిష్టివేసిన అధికారి

రైతుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన సహకార సంఘాలు నిధుల స్వాహా కేంద్రాలుగా మారాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పడగల్ సొసైటీలో సెక్రటరీగా 15 ఏళ్లు తిష్టవేసిన దయాసాగర్ కు సొసైటీ నిధులను సొంతానికి వాడుకోవడంలో సిద్ధహస్తుడనే పేరుంది. రాష్ర్ట ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేయడంతో కుంభకోణం వెలుగుచూసింది. విచారణ పూర్తయితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ప్రస్తుత కార్యదర్శి సైతం దయాసాగర్ కు మీ తీసిపోనట్లు వ్యవహరిస్తున్నాడని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు ఆరోపించారు.

More articles

Latest article