- కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 282ను నిరసిస్తూ, ఆ జీవోను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ధర్నా చౌక్ వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వై.ఓమయ్య, టియుసిఐ జిల్లా కార్యదర్శి ఎం.సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జి.భూమయ్య మాట్లాడుతూ జులై 5న రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో సవరణ పేరుతో జీవో నెం:282 ను విడుదల చేసిందన్నారు. వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో, కార్మికులతో రోజుకు 10 గంటలు పనిచేయించుకోవచ్చని, వారానికి 48 గంటలు మించకూడదని, అది దాటితే ఓటి చెల్లించాలని ఈ జీవోలో పేర్కొన్నదన్నారు. అయితే ఈ జీవోలో అస్పష్టత, సందేహాలు ఉన్నాయన్నారు. కార్మికులతో, కార్మిక సంఘాలతో చర్చించకుండా తీసుకువచ్చిన ఈ జీవోను వ్యతిరేకిస్తున్నామని, వెంటనే జీవో నెంబర్ 282 అమలును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పని గంటల పెంపు విషయంలో, మోడీ ప్రభుత్వ విధానాన్నే, కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే అనధికారికంగా 10 గంటల చొప్పున పనిచేయిస్తున్న యాజమాన్యాలు, ఈ జీవో కారణంగా చూపి, మరింత శ్రమదోపిడీకి పాల్పడతాయన్నారు. మల్టీ నేషనల్, అతి పెద్ద షాపింగ్ మాల్స్ లో సెక్యూరిటీ గార్డులు, సేల్స్ పర్సన్స్, ఇతర సిబ్బంది రోజంతా నిలబడే పనిచేస్తున్నారన్నారు. వీరి శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదన్నారు. కార్మికులకు అందుతున్న సౌకర్యాలు వేతనాలపై కార్మిక శాఖ వద్ద నివేదికలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. జీవోలో పనిగంటలను పెంచుతూ మాత్రమే పేర్కొన్నారనీ, కానీ, కార్మికుల ఉద్యోగ భద్రత, ఆరోగ్య, జీవన భద్రత, తగిన వేతనాలపై స్పష్టత లేదన్నారు. జీవోలో వారి కనీస వేతనం ఎంతో ప్రకటించాలన్నారు. అస్పష్టమైన జీవోవల్ల వాణిజ్య సంస్థలు, యాజమాన్యాలు లాభం పొందుతాయి కానీ, అందులో పని చేసే కార్మికులకు ప్రయోజనం లేదన్నారు. పైగా మరింత శ్రమదోపిడికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి కార్మిక శాఖ జీవోను అభయన్స్ లో పెట్టి కార్మిక సంఘాలతో చర్చ జరపాలని, అప్పటివరకు జీవో అమలును ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సాయన్న, రాములు, రవి, ఇమ్రాన్ అలీ, ప్రసాద్, కిరణ్, సురేష్, నవీన్ , గంగాధర్, లక్ష్మీ, నరసయ్య, గంగారం తదితరులు పాల్గొన్నారు.
