- నాలుగు సంఘాలకు జరిగిన ఎన్నికలు
- రాత్రి వరకు కొనసాగిన పోలింగ్
- ఈ నెల 7న కౌంటింగ్.. ఫలితాలు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. జిల్లా కేంద్రంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం, మాణిక్ భవన్ పాఠశాల, వైశ్య భవన్, కన్యకాపరమేశ్వరి దేవాయలం పాలకమండళ్ల ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ రాత్రి వరకు కొనసాగింది. నగరంలోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల (మాణిక్ భవన్)లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహించారు. 10017 మంది ఓటర్లు, నాలుగు సంఘాల పాలకమండలి సభ్యుల ఎన్నికకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాణిక్ భవన్ పాఠశాలలో మహిళ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఒక ప్యానల్ కు సంబంధించిన మద్దతుదారులు వ్యవహరించిన వీడియో బయటకు వచ్చింది. ఈ విషయంపై మరో ప్యానల్ ద్వారా వచ్చి ఎన్నికల అధికారులతో గొడవకు దిగారు. నాలుగు సంఘాల ఎన్నికలకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సమయం సరిపోకపోవడంతో రాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ నెల 7న నగర వైశ్య సంఘం (కిసాన్ గంజ్ )లో కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. 10వేల పైచిలుకు ఓటర్లు ఉండగా ఓట్ల శాతాన్ని బట్టి ఫలితాలు 7న రాత్రి లేదా 8న ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. పోటీ పడిన ప్రధాన అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వైశ్య సంఘం ఎన్నికల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగిందని పట్టణ వైశ్య సంఘం ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రాస్ ఓటింగ్ ప్రత్యర్థులకు మేలు చేస్తుందేమోననే భయాందోళనకు గురవుతున్నారు. మరికొందరు మాత్రం తమ గెలుపును ముందే ఊహించి క్రాస్ ఓటింగ్ అని ప్రచారం చేస్తున్నారని ప్రత్యర్థులు చెబుతున్నారు.
