26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కార్మికుల మృతదేహాలను అట్టపెట్టల్లో తరలించడం దారుణం

Must read

📰 Generate e-Paper Clip

  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 

హైదరాబాద్, బతుకమ్మ : సిగాచీ ఫ్యాక్టరీ పేలుడులో చనిపోయిన వారి పట్ల రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానవీయమని బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్ మండిపడ్డారు. కార్మికుల మృతదేహాలను అట్టపెట్టల్లో తరలించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాయి రాష్ట్రం నుంచి తెలంగాణకు ఉపాది కోసం వచ్చి చనిపోయిన కార్మికుల మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. భయంకర పేలుడు జరిగి యాభై మందికి పైగా చనిపోతే రేవంత్ రెడ్డి మాత్రం సంఘటన స్థలానికి వెళ్లి ఫోటో షూట్ చేశారని ఎద్దేవా చేశారు. కోవిడ్ సమయంలో దేశంలోని ఏ రాష్ట్రం కూడా వలస కార్మికులను పట్టించుకోకపోతే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లను అక్కున చేర్చుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధిలో వలస కార్మికులు వాటాదారులన్నారు.. వాళ్లకూ సమాన హక్కు ఉందన్నారు. రేషన్, వైద్య సదుపాయంతో పాటు స్వస్థలాలకు వెళ్లడానికి వారికి ఉచిత రవాణా సదుపాయాన్ని ఏర్పాటుచేశారని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. సిగాచీ పేలుడు తరువాత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలం అయిందన్నారు. సిగాచీ ఫ్యాక్టరీ పేలుడులో ఆచూకీ తెలియకుండా పోయిన వారి వివరాల కోసం కుటుంబసభ్యులు పోలీసుల కాళ్ల మీద పడుతున్నారని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారన్న దానిపై కచ్చితమైన సమాచారం లేదన్నారు. ఎస్.ఎల్.బి.సి టన్నెల్ కూలిన ఘటనలో చనిపోయిన ఎనిమిది మంది మృతదేహాల కోసం ఇప్పటికీ వారి కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారని, వారికి పరిహారం ప్రకటించలేదని అన్నారు. వలస కార్మికులు మనుషులు కారా? చనిపోయిన వారికి కనీస గౌరవం ఇవ్వలేరా? అని ప్రశ్నించారు.

More articles

Latest article