- ఈనెల 30న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
- యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజారామ్ యాదవ్
నిజామాబాద్, బతుకమ్మ : గతంలో ఎన్నడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ యాదవ కులస్తులను అణిచివేస్తుందని రాజారాం యాదవ్ ఘాటుగా విమర్శించారు. యాదవులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత చూపుతుందని రాష్ట్ర అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం యాదవ సంఘం ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదవులను, మున్నూరు కాపులను ఇతర కులాలను అణిచివేస్తుందని అన్నారు. బీసీలను అణగదొక్కడమే సామాజిక న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించారు. మంత్రివర్గంలో, కార్పొరేషన్, పార్టీ పదవులలో యాదవులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఈనెల 30న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా మహా ధర్నా చేపడుతున్నట్లు వెల్లడించారు. యాదవ కులస్తుల ఐక్యమత్యాన్ని చాటే విధంగా చేపడుతున్న ధర్నాకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి యాదవ సోదరులు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. అత్యధిక జనాభా ఉన్న యాదవులను రేవంత్ రెడ్డి కించపరుస్తూ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం, కనీసం ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించకపోవడం యాదవులను అవమానించడమేనన్నారు. యాదవ లోకాన్ని అవమానపరిచే విధంగా వివరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని రాజారామ్ యాదవ్ పిలుపునిచ్చారు. అనంతరం 30న హైదరాబాద్లో జరిగే మహా ధర్నా కు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. బీసీలకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు కార్యక్రమంలో యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, జిల్లా కన్వీనర్ బాపూరావు యాదవ్, యాదవ సంఘం ప్రతినిధులు రాజన్న యాదవ్, జనార్దన్ యాదవ్, లింగన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
