- 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పత్తాలాట గ్యాంగ్ హవా
- పది రోజుల్లో రెండుసార్లు పట్టుబడిన ఆగని పత్తాలాట
- సార్లను మేనేజ్ చేశామని పేకాట రాయుళ్ళకు హామీ
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్యాంగ్ పత్తాలాట నిర్వాహణలో ఆరితేరింది. నిత్యం జూదం ఆడకుండా పొద్దుగడవని పేకాటరాయుళ్ళను రప్పించి పేకాట ఆడించడం ఆ గ్యాంగ్ కు రివాజుగా మారింది. పోలీసు సార్లను మేనేజ్ చేశామని భరోసా ఇచ్చి పత్తాలాటను కొనసాగిస్తున్నారు. పదిరోజుల వ్యవధిలో పోలీసు అధికారులు దాడులు నిర్వహించినా గ్యాంగ్ మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఈ నెల 12న నిజామాబాద్ నగర శివారులోని గుండారం రోడ్డులోని రైల్వేగేట్ వద్ద 6వ టౌన్ పోలీసులు పత్తాలాట కేంద్రంపై దాడి చేశారు. పత్తాలాటకు అనుగుణంగా షెడ్డును నిర్మించి దానికి నలువైపుల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సెల్ ఫోన్ కు అనుసంధానం చేసుకుని పత్తాలాట ఆడిపిస్తున్నారు. 12న జరిగిన పోలీసుల దాడిలో 10 మంది పేకాట రాయుళ్ళు పట్టుబడ్డారు. వారి వద్ద 76 వేల నగదుతో పాటు 12 సెల్ ఫోన్లు, వాహనాలను సీజ్ చేశారు. వారిపై గేమింగ్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. అయినా కూడా సంబంధిత గ్యాంగ్ వెనక్కి తగ్గకుండా ఈసారి రూట్ మార్చారు. శాస్త్రినగర్ శివారులో ఒక ఇంట్లో పేకాట అడ్డాను ఏర్పాటు చేసి జూదాన్ని కొనసాగించారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ ఆధ్వర్యంలో దాడి చేసి పేకాట రాయుళ్ళను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వాహకులను చూసి పోలీసులే షాక్ కు గురయ్యారు. ఈ నెల 12న పట్టుబడిన మీర్జా జవీద్ బేగ్, రహీంలతో పాటు ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా రెండుసార్లు పట్టుబడడం విశేషం. ఇద్దరు నిర్వాహకులు పత్తాలాట నిర్వాహణలో ఆర్గనైజర్లుగా పేరుగడించారు. వారు పత్తాలాటను రీక్రియేషన్ కోసం కాకుండా డబ్బులు పందేం కాస్తూ నిర్వహిస్తుండడం చూసి అందరూ షాక్ కు గురవుతున్నారు. ఈ నెల 12న పోలీసు రైడ్ లో పది మంది దొరకగా తాము సార్లను మేనేజ్ చేశామని మరోసారి పత్తాలాట ఆడేవారిని ఏకం చేసి ఆడిస్తుండగా రెండవసారి చిక్కినట్లయింది. పత్తాలాటతోనే జీవన భృతిగా మార్చుకున్న ఆర్గనైజర్లపై పోలీసు శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
