26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కార్మిక హక్కుల రక్షణ కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొ.లింబాద్రి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కార్మిక హక్కుల రక్షణ కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాలని ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొ.లింబాద్రి అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో భాగంగా నగరంలోని ఆర్.ఎన్ ఫంక్షన్ హాల్ లో ప్రతినిధుల సభ నిర్వహించారు. ముందుగా టీయూసీఐ జెండాను రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రతినిధుల సభలో ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడారు. పోరాటాల వల్లనే హక్కులు దక్కుతాయని, కార్మిక హక్కుల రక్షణ కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్పొరేట్ కంపెనీలే కాకుండా ప్రభుత్వాలు సైతం శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, ఒక గొప్ప సమాజ నిర్మాణం కోసం ఈ మహాసభల వేదికగా చర్చ జరగాలని, ఆ వైపుగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద శక్తులతో మతోన్మాద శక్తులు కలిసి దేశాన్ని పీడిస్తున్నాయి. టియుసిఐ ఆల్ ఇండియా అధ్యక్షులు అమ్రిష్ పటేల్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వనమాల కృష్ణ, కే.సూర్యం లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల,  ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రపంచాన్ని సామ్రాజ్యవాదం పీడిస్తుంటే, మన దేశాన్ని సామ్రాజ్యవాద శక్తులతో కలిసి మతోన్మాత శక్తులు పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనా గాజా, ఇరాన్ లపై ఇజ్రాయిల్, అమెరికా యుధోన్మాద దాడులను ఖండిస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత ప్రజల ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్నదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల్ని చైతన్యం చేస్తామన్నారు. దేశంలోని 40 కోట్ల మంది కార్మిక వర్గం మోడీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా నిరసిస్తున్నదన్నారు. వచ్చేనెల 9న కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ద్వారా మోడీ ప్రభుత్వానికి కార్మిక శక్తిని తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్ ఎస్ఎల్ పద్మ, ఎం.హన్మేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కే.రాజన్న, జీ.రామయ్య, సి. వెంకటేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకన్న, రాజేశ్వర్, ముత్తెన్న, మల్లేష్ సత్యక్క, రమేష్, యాకుబ్ షావలి, వెంకట్, రెడ్డి, అశోక్, సాంబశివుడు, కిరణ్, ప్రసాద్, హనుమంతు, రాజు,  దేవదానం, రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Strong movements must be built to protect labor rights.

More articles

Latest article