27.5 C
Hyderabad
Friday, July 31, 2026

పోలవరం ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

  • 25న ప్రధాని ప్రగతి ఎజెండా సమావేశంలో దీనిపై చర్చించాలి
  • పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలి
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ లో కలిపిన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తేదీన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రగతి ఎజెండా పేరిట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించబోయే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని సూచించారు. పోలవరం ముంపుపై, ఏపీలో కలిపిన భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న అంశంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఏపీలో కలిపిన గ్రామాల్లోని ఫురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య వివక్షకు గురవుతూ ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉన్నారని వివరించారు.  కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందని, లేదంటే ఏ ఒక్క ఏడాదిలో కూడా భారీ వరదలు వస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని తెలిపారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని, భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాముడి భూమి వెయ్యి ఎకరాలు ఉందని, వెయ్యి ఎకరాల దేవుడి మాన్యం ఆంధ్రాకి పోయింది.. దేవుడేమో తెలంగాణలో ఉన్నాడు అని తెలిపారు. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ముంపుపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్త సర్వే నిర్వహించాలని సూచించారు.  ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.

Polavaram flooded villages should be returned to Telangana

అవసరమైతే ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీం కోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. 2014లో ప్రధాని మోదీ మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో లో ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్ ను ఆమోదించి అన్యాయం చేశారని విమర్శించారు. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని, లోయర్ సిలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఏపీ అప్పజెప్పారని మండిపడ్డారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు ఏడు మండలాలను తీసుకున్నారని ఆరోపించారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని అప్పుడే పార్లమెంటులో తాము గళమెత్తామని, బీఆర్ఎస్ పార్టీ సభ్యులం పార్లమెంటులో మాట్లాడాము కానీ కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఆ నాడు కూడా పట్టనట్టు వ్యవహరించారని తెలియజేశారు. సీపీఐ – ఎంఎల్ (న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ మాట్లాడుతూ, కేంద్రంలో చంద్రబాబు కీలకంగా ఉండటంతోనే 2014లో అవసరం లేకపోయినా తెలంగాణలోని ఏడు మండలాలను నరేంద్రమోదీ ప్రభుత్వం ఆంధ్రలో విలీనం చేసిందన్నారు. భద్రాచల రాముడికి మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. పోలవరం ముంపులో భాగం కాని ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలుపుతూ ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు. భద్రాచలంతో తెలంగాణ ప్రజలకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. భద్రాచలం లేని తెలంగాణను ఊహించడం కష్టమన్నారు. ఈ నెల 25వ తేదీన ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో జరిగే సీఎంల మీటింగ్ లోఐదు గ్రామ పంచాయతీలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఐదు గ్రామ పంచాయతీల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో భద్రాచలం డెవలప్మెంట్ ఫోరం, ఐదు గ్రామ పంచాయతీల హక్కుల సాధన సమితి నాయకులు జంగిలి సంపత్, ఆవులూరి సత్యనారాయణ, దాసరి బాలకృష్ణ, రాసాల నర్సయ్య, గొల్లపల్లి శివ, కాటిబోయిన ఆనంద్, వివిధ ప్రజాసంఘాల నాయకులు వీరన్న, రూప్ సింగ్, లోకిని రాజు, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రౌండ్ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను ఈనెల 25న నిర్వహించే ప్రగతి ఎజెండా సమావేశంలో ప్రధాని ముందు పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు.

Polavaram flooded villages should be returned to Telangana

More articles

Latest article