- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: వన మహోత్సవం కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వన మహోత్సవం కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ బుధవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీ.ఎఫ్.ఓ వికాస్ మీనాలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా 2025 – 2026 వార్షిక సంవత్సరానికి ఆయా శాఖల వారీగా వన మహోత్సవం కింద నాటాల్సిన మొక్కలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించారు. ఆయా శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపల్ పట్టణాలలో మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. వన మహోత్సవంను ప్రాధాన్యత అంశంగా భావిస్తూ, నిర్ణీత గడువు లోపు లక్ష్యం పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లతో సన్నద్ధం అయి ఉండాలన్నారు. మండల ప్రత్యేక అధికారులతో పాటు, సూపర్వైజరీ అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నర్సరీలను, వైకుంఠధామాలు, ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాలని అన్నారు. నాటిన మొక్కల స్థితిగతులను తప్పనిసరిగా పరిశీలన చేయాలని, వన మహోత్సవం అమలు తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. నాటిన మొక్కలు ఏ స్థితిలో ఉన్నాయన్నది తెలియజేస్తూ వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు ప్రతి గ్రామ పంచాయతీని విధిగా సందర్శించి మొక్కల పెంపకాన్ని పరిశీలించాలన్నారు. ఎక్కడైనా మొక్కలు ఎండిపోయి ఆనవాళ్లు కోల్పోతే, అందుకు గల కారణాలను అన్వేషించాలని, ఆ తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలను నాటాలని అన్నారు. గత సంవత్సరం మొక్కలు నాటిన ప్రదేశాలతో పాటు, ప్రస్తుత సంవత్సరంలో మొక్కలు నాటనున్న ప్రాంతాలలో తప్పనిసరిగా వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పచ్చదనాన్ని పెంపొందించాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అప్పుడే వన మహోత్సవం లక్ష్యం సిద్ధిస్తుందని అన్నారు. కేవలం గుంతలు తవ్వి, మొక్కలు నాటి, వాటికి నీటిని అందించడంతోనే సరిపెట్టుకోకుండా, సాసరింగ్, ఫెన్సింగ్, మొక్కలకు సపోర్ట్ కర్రలను అమర్చడం వంటి వాటిపై కూడా దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. మొక్కల పెంపకం కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులు, కాంపోనెంట్ లను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఉపాధి హామీ కూలీలకు పని దినాలు ఎక్కువ మొత్తంలో లభించడమే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా ఆదాయం సమకూరుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. బ్లాక్ ప్లాంటేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, వచ్చే 2026 లో చేపట్టే వన మహోత్సవం కోసం ఇప్పటి నుండే నర్సరీలలో మొక్కల పెంపకం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నవంబర్ నెల నాటికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా నర్సరీ నిర్వహణ చేపట్టాలని కమిషనర్ దిలీప్ కుమార్ ను ఆదేశించారు. వన మహోత్సవం అమలులో నిర్లక్ష్యానికి తావు లేకుండా అంకిత భావం, సమన్వయంతో పని చేస్తూ నిర్ణీత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. సమీక్షా సమావేశంలో డీఆర్డీఓ సాయాగౌడ్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

