. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
కృషితో నాస్తి దుర్భిక్షం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఇష్టంగా కష్టపడి చదివి మంచిఫలితాలు సాధించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య విద్యార్ధులకు హిత బోధ చేశారు.ఎమ్మెస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పది, ఇంటర్మీడియట్ తరగతుల్లో అత్యుత్తమ ఫలితాలు సాదించిన తెలంగాణ లోని 11 జిల్లాల నుంచి వచ్చిన రెండు వందల మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఆదివారం నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్స్ లో పదివేల రూపాయల చొప్పున ఎమ్మెస్సార్ సహాయత చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతురాజు సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు పంపిణీ చేసి మాట్లాడుతూ..జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యసాధనకు కష్టపడి ముందుకు సాగితే ఫలితం దక్కుతుందన్నారు. ఆర్థిక స్థితిగతుల మీద కాకుండా కష్టపడి చదివినందున ఈ రోజు ఎమ్మెస్సార్ ట్రస్టు పదివేల రూపాయల చొప్పున అందజేసిన చెక్కులకు తాము అర్హులమయ్యామనే విషయాన్ని విద్యార్థులు గుర్తెరగాలని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు…
ఉన్నత విద్యాభ్యాసం కోసం పై తరగతులకు వెళ్తున్న విద్యార్థులు కొత్త పరిచయాలను తమ ఉన్నతి కోసం వాడుకోవాలని సూచించారు. చెడు పరిచయాలకు దూరంగా ఉండాలని, కొత్త పరిచయాల క్రమంలో మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దన్నారు. వ్యక్తిత్వ వికాసం కోసం కష్టపడాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్సార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం.సాంబశివారెడ్డి, డైరెక్టర్లు ధనుష్ రెడ్డి, జి.రాజిరెడ్డి, డాక్టర్ అబ్బాపూర్ రవి, వడ్డే శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
