27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రెండు, మూడు రకాల భూ సమస్యలకు ఒకే దరఖాస్తు

Must read

📰 Generate e-Paper Clip

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

మాదాపూర్, నల్లూర్, కిసాన్ నగర్ రెవెన్యూ సదస్సులలో పాల్గొన్న కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ :  ఒకే దరఖాస్తులో రైతులు రెండు, మూడు రకాల భూ సమస్యలను పేర్కొనవచ్చని, సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఆన్లైన్ లో జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. రెవెన్యూ సదస్సులలో భాగంగా బుధవారం జక్రాన్పల్లి మండలం మాదాపూర్, ముప్కాల్ మండలం నల్లూర్, కిసాన్ నగర్ గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులతో భేటీ అయ్యి, భూ సంబంధిత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి, అధికారులకు సూచనలు చేశారు. సరిపడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలన్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు ఆస్కారం కల్పించకూడదని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. భూ రికార్డులలోని వివరాలను పక్కాగా సేకరిస్తూ, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి,  క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్ణీత గడువు లోపు పరిష్కరిస్తామన్నారు. సమయపాలన పాటిస్తూ,   అర్జీలు స్వీకరించాలని రెవెన్యూ బృందాలను ఆదేశించారు.  రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహశీల్దార్ కిరణ్మయి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Single application for two or three types of land issues

More articles

Latest article