- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ :ప్రజావాణి లో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై అర్జీలు అందాయి. ఈ రోజు ప్రజావాణి లో (86) అర్జీలు పలు శాఖలకు చెందినవి అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి ఆయా శాఖల అధికారులు సాధ్యా సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా పెండింగులో ఉన్న 409 అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపడుతూ దరఖాస్తు దారునికి రాత పూర్వకంగా సమాచారం అందించాలని తెలిపారు. రాజీవ్ యువ వికాసం నకు సంబంధించిన దరఖాస్తులు ఆయా బ్యాంకుల నుండి వెరిఫికేషన్ చేయించాలని, సంబంధిత ఎంపీడీఓ లు మానిటరింగ్ చేయాలని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు మార్క్ అవుట్ త్వరగా ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని తెలిపారు. ప్రతీ నియోజక వర్గంలో లక్ష్యానికి అనుగుణంగా ఇండ్ల మంజూరు చేపట్టాలని అన్నారు. భూ గర్భ జలాల పెంపునకు ప్రతీ గ్రామంలో ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ లను ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ ,పలు శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

