- కార్డు రెన్యువల్ చేయకున్నారక్త పరీక్షలు
- మృతుడు కోల్పోయిన రూ.ఒక లక్ష 30 వేలు
- పట్టించుకోని కార్మిక శాఖ
నిజామాబాద్, బతుకమ్మ: డబ్బులు సంపాదించుకునేందుకు కుళ్ళు, కుతంత్రాలను కార్మికుల పైననే ప్రయోగిస్తున్నారు. వారి అవివేకాన్ని రక్తం రూపంలో గుంజి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా, కార్మిక శాఖ పేరుతో రక్త పరీక్షలు చేసుకోవాలని చెప్తున్నారు. చేసుకోకపోతే లేబర్ కార్డ్ పై సౌకర్యాలు (బెనిఫిట్స్) రావని భయపెట్టి రక్తం గుంజుతున్నారు. ఇది ఎలా అంటే దొంగలు అడవిలో దోచుకుంటే, వీళ్ళు ఊళ్ళో దోచుకుంటున్నారు. కార్మిక శాఖ సహకారంతో లేబర్ కార్డు లేకపోయినా, ఉన్నా అది చెలామణిలో లేకున్నా రక్త పరీక్షలు చేసినట్లు చూపించి రూ.కోట్లు దండుకుంటున్నారు.

- కార్డు రెన్యూవల్ గాకున్నా..
కార్మికుడు లేబర్ కార్డును తీసుకుంటే అయిదేళ్ళ వరకు పని చేస్తుంది. గడువులోగా దీనిని రెన్యూవల్ చేయించుకుంటేనే, వెల్ఫేర్ బోర్డు నుంచి వచ్చే బెనిఫిట్స్ (సౌకర్యాలు) అందుతాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట్ కు చెందిన కార్మికుడు బెస్త రాములు 2016లో లేబర్ కార్డు (2016/00064)ను తీసుకున్నాడు. అయిదేళ్ళ (2021లో) తర్వాత రెన్యూవల్ చేయాలనే విషయం తెలియకపోవడంతో వృధాగా ఉండిపోయింది. సి.ఎస్.సి హెల్త్ కేర్ సంస్థ 2023 జనవరి నుంచి కార్మికుల రక్తం గుంజుడు మొదలెట్టిన కార్యక్రమంలో బెస్త రాములు లేబర్ కార్డ్ చెలామణిలో లేకున్నా అదే సంవత్సరం డిసెంబర్ 6న (క్యాంపు ఐడి 19851), మళ్ళీ 2024 నవంబర్ 12న (ఐడి 43333) రక్త పరీక్షలు చేసారు. దురదృష్టవశాత్తూ పరీక్ష చేసిన నెలలోపే బెస్త రాములు మృతి చెందాడు. లేబర్ కార్డు పై సహజ మరణం కింద ఒక లక్ష రూపాయలు, అంత్యక్రియలకు రూ.30 వేలు వస్తాయనే ఆశతో అందుబాటులో ఉన్న కార్మిక శాఖ అధికారుల దగ్గర మృతుడు బెస్త రాములు తరపు వారు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్ళారు. కార్డు చూసి, దీని గడువు ముగిసి మూడేళ్ళు అవుతుందని బెనిఫిట్స్ ఏమి రావని చెప్పారు. కార్డ్ లాప్స్ అయితే హెల్త్ కేర్ వారు రక్త పరీక్షలు ఎలా చేసారని నిలదీయగా, లేబర్ అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది.
- మృతునికి అన్యాయం..
కార్డు చెలమణిలో లేకున్నా రక్త పరీక్షలు చేసుకునేందుకు సి.ఎస్.సికి కార్మిక శాఖ అనుమతి ఇచ్చినపుడు, శాఖ పరంగా వచ్చే బెనిఫిట్స్ ను మృతుడు బెస్త రాములుకు ఇప్పిస్తే తప్పేలా అవుతుందనే ప్రశ్నలు కార్మిక వర్గం నుంచి వస్తున్నాయి. కార్మికుల కోసం గాకుండా పరోక్షంగా మామూళ్ళు ఇస్తున్న సంస్థలకు కార్మిక శాఖాధికారులు కొమ్ము కాస్తున్నట్లు ఈ ఒక్క సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు.

