- పంటచేల్లోనే మొలకకట్టిన సజ్జ
- కల్లాల్లో తడిసిపోయిన నువ్వు పంట
మోర్తాడ్, బతుకమ్మ: గ్రామ నడిబొడ్డున గల రచ్చబండ దగ్గర చెట్టు కింద రైతుల కూర్చొని ఉంటుండగా ఒక వ్యక్తి గ్రామాన్ని సందర్శించడానికి సంతోషంతో వచ్చారు. రైతును బాగున్నావా..? అని పలకరించాడు. అంతే రైతు కంటినిండా కన్నీరే కనబడింది. గ్రామాల్లో ఉన్న రైతుల పరిస్థితి ఇప్పుడు ఇలాగే కనిపిస్తుందని తెలపడంలో సందేహం లేదు. పంట చేతికొచ్చింది.. కండ్ల ముందు రాశులుగా పోసుకున్నారు.. కల్లాల్లో వడ్లు తడిసిపోవడం.. ఒకపక్క బాధతో ఉన్నప్పటికీ.. మరోపక్క సజ్జ పంట చేతికొచ్చింది అనుకున్న సమయంలో అకాల వర్షం తో చేనులోనే సజ్జ పంట మొలక రావడంతో దెబ్బ మీద దెబ్బ రైతన్నకు తగలడంతో కంటి నిండా కన్నీరే కనబడుతుంది. పంట కోసం పెట్టిన పెట్టుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తన ఆవేదన స్పష్టంగా కనబడుతుంది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు 13000 ఎకరాల్లో సజ్జ పంటను పండించారు. ఇందులో ఆర్మూర్ డివిజన్లో 3200 ఎకరాల్లో పండించగా బాల్కొండ నియోజకవర్గంలో 6000 ఎకరాల వరకు సజ్జ పంటను రైతులు పండించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వారం రోజుల్లో పంట కోసి నూర్పడి చేసి అమ్ముకునే సమయంలో అకాల వర్షం కారణంగా వందల ఎకరాల్లో దెబ్బతిని కొందరి పంటచేళ్లలో సజ్జ కోయకుండానే కంకులపై గింజలకు మొలకలు రావడంతో రైతు ఆశలు అడియాశలుగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు పంట కోసి కల్లాల్లో ఆరబోయడంతో తడిసి కల్లాల్లోనే మొలకలు వచ్చినాయి. అలాగే బాల్కొండ నియోజకవర్గంలో 500- 600 ఎకరాల వరకు నువ్వు పంట వేశారు. నువ్వు పంట చివరి దశలో ఉండగా అకాల వర్షంతో నువ్వు పంట తడిసిపోయి పెట్టిన పెట్టుబడి కూడా రాదు అని రైతులు దుఃఖంతో ఉన్నారు. వరిధాన్యం కల్లాల్లో తడిసిపోవడం, సజ్జ కోయకుండానే మొలక రావడం, నువ్వు పంట తడిసి ధర పలకకపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడి రాక అప్పుల ఊబిలో కూరుకపోయామని లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

