- బతుకమ్మ ఎఫెక్ట్ . . .
- ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరి
- వ్యవసాయ శాఖ ఏవో కుటుంబాన్ని వేదించిన ఫలితం
- కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన ఏవో కుటుంబ సభ్యులు
- మద్దతు తెలిపిన టీజీవో, మండల వ్యవసాయాధికారులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండల వ్యవసాయ శాఖ ఏడిఏ ప్రదీప్ ను సస్పెన్షన్ చేస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్ ఏడిఏగా పని చేస్తున్న ప్రదీప్ తమను వేదిస్తున్నాడని ఈ నెల 14న కలెక్టరేట్ లో సంఘం ప్రవీణ్ కుటుంబ సభ్యులు కలెక్టరేట్ లో నిరసన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల వ్యవసాయాధికారిగా పని చేస్తున్న సంఘం ప్రవీణ్ గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విధి నిర్వహణలో గుండెపోటుతో చనిపోయాడు. ప్రవీణ్ కుటుంబానికి ప్రభుత్వం తరపున రావాల్సిన బెనిఫిట్స్ అందజేయడంలో రూరల్ ఏడిఏ ప్రదీప్ నిర్లక్ష్యం చేశాడు. దానితో అతని కుటుంబానికి ఏడాది కాలంలో రావాల్సిన ప్రయోజనాల్లో ఒక్క రూపాయి కూడా రాలేదు. కనీసం కారుణ్య నియామకంతో పాటు ప్రయోజనాల ఫైల్ ముందుకు కదులాలంటే తనను సాటిస్ ఫై చేయాలని ఏడిఏ ప్రదీప్ కుటుంబ సభ్యులను వేదించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆయన అదనపు కలెక్టర్ ద్వారా విచారణ జరిపించి ఏడి ప్రదీప్ పై చర్యలకు సిఫారసు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోగా ప్రవీణ్ కుటుంబ సభ్యులు, టీజీవో బాధ్యులు, మండల వ్యవసాయాధికారులపైనే ఏడి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ చేస్తున్నారని వారిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుటుంబ సభ్యులు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. వారికి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మండల వ్యవసాయాధికారుల సంఘం మద్దతు తెలిపింది. ఏడిఏను సస్పెన్షన్ చేయాలని లేకపోతే తాము సామూహిక సెలవులో వెళ్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ విషయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ కు నేరుగా మాట్లాడడంతో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సింగిరెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ శివాజిపటేల్ లతో విచారణ జరిపించారు. వారు వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో, రూరల్ ఏడిఏ కార్యాలయంలో విచారణ జరిపి నివేదికను కమిషనర్ కు అందజేశారు. విచారణ నివేదిక ఆధారంగా వ్యవసాయ శాఖ రూరల్ ఏడిఏ ప్రదీప్ ను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
