30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

‘సిరి’ని కాపాడుతున్నది ఎవరు..?

Must read

📰 Generate e-Paper Clip

  • రెండు కోట్ల రూపాయలు ఎగవేత
  • మెడికల్ కళాశాల ఉపాధి కల్పనలో అధికారుల నిర్లక్ష్యం
  • మామూళ్లు అందించి తప్పించుకున్న ఏజెన్సీ
  • కలెక్టర్ స్పందిస్తేనే బాధితులకు న్యాయం

 

నిజామాబాద్, బతుకమ్మ: రెండు శాఖల ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి ఏజెన్సీకి లబ్ధిచేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ ఎగవేసిన ఏజెన్సీకి అధికారులే వత్తాసు పలకడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుత ఏజెన్సీ కూడా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన నాయకులకు సంబంధించిన ఏజెన్సీ. దీనిని కూడా కాంగ్రెస్ హయాంలో రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం కామారెడ్డి లో చర్చగా మారింది. ఉద్యోగుల డబ్బులను ఎగవేసిన ఏజెన్సీని సదారు అధికారులు వెనకేసుకు రావడం విచారణ పేరిట కాలయాపన చేయడం కొనసాగుతుంది. ఉద్యోగులకు మాత్రం న్యాయం జరగడం లేదు. సదరు ఏజెన్సీ నాయకుడు భారీగా డబ్బులు ముట్ట చెప్పి తప్పించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • అసలు ఏం జరిగిందంటే..

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్వహణకు సంబంధించి గత రెండు సంవత్సరాల క్రితం ఏజెన్సీకి బాధ్యతలు అప్పజెప్పారు . వీరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించడం.. వారికి వేతనాలు చెల్లించడం కొనసాగుతుంది. ఇలా 75 మంది ఉద్యోగులను, ఒకసారి మరో 80 మంది ఉద్యోగులను రెండోసారి కేటాయించారు. వీరికి వేతనాలు, ఇతరత్రా పనులను సదరు ఏజెన్సీ మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. రెండేళ్ల కాల పరిమితికి ఏజెన్సీని ఎంపిక చేశారు. గత ప్రభుత్వ హయాంలో టిఆర్ఎస్ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు ఈ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. నిర్వాకుడు మాత్రం అప్పగించిన పనిని సక్రమంగా చేయకుండా వచ్చిన డబ్బులను మాత్రం జేబులో వేసుకున్నాడు. సుమారు 100 మంది ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్, ఈఎస్ఐ ఎగవేశాడు. రెండున్నర సంవత్సరాలకు సంబంధించి ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ రెండు కోట్ల 20 లక్షల రూపాయలను తన ఖాతాలోకి వేసుకున్నాడు ఉద్యోగులకు ఈపీఎఫ్ ఈఎస్ఐ చెల్లిస్తున్నట్లు కేవలం మౌఖికంగా మాత్రమే నమ్మబలికాడు. చివరకు వారు తమ అకౌంటులను పరిశీలించి చూసేసరికి రెండున్నర సంవత్సరాల నుండి ఈపీఎఫ్, ఈఎస్ఐ జమ కావడం లేదని గుర్తించారు. దీంతో మెడికల్ కళాశాల అధికారులను సంప్రదించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కానీ వారు ఏమాత్రం స్పందించలేదు. ఇందులో కొందరు ఉద్యోగులు నేరుగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయగా కలెక్టర్ విచారణ ఆదేశించారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సాధారణ ఏజెన్సీ నిర్వహణపై విచారణ చేపట్టారు. దీంతో ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్, ఈఎస్ఐ రెండున్నర సంవత్సరాల నుంచి కట్టడం లేదని తేలింది. ఇలా రెండున్నర కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల అధికారులు ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు, ఆ ఏజెన్సీ ఎంతమంది ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించలేదనేది నివేదికను ఉపాధి కల్పన శాఖ అధికారులకు అందజేయాల్సి ఉంది. సదరు అధికారులు దానిని పరిగణలోకి తీసుకొని ఏజెన్సీ పై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సుమారు 8 నెలల నుండి మెడికల్ కళాశాల ఉపాధి కల్పన శాఖ అధికారులు సదరు ఏజెన్సీ కి సంబంధించి విచారణ పేరిట కాలయాపన మాత్రమే చేస్తున్నారు. చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.

  • మామూళ్లు అందించి..

భారీగా అవినీతి పాల్పడ్డ సదరు ఏజెన్సీ నిర్వాకుడు ఎలాగైనా చర్యల నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. గత ప్రభుత్వంలో హయాంలో జరిగిన కేటాయింపులు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వంలోని వారు సీరియస్గా స్పందిస్తారని ఆలోచించి అసలు విచారణ జరగకుండా అడ్డుకున్నాడు. సదరు అధికారులకు భారీగానే ముడుపులు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితో ఒత్తిళ్లు తీసుకువచ్చి డబ్బులు అందించినట్లు సమాచారం. ఓ అధికారికి 8 లక్షల చొప్పున మరో అధికారికి 10 లక్షల చొప్పున అందించి సదరు ఏజెన్సీ నిర్వాకుడు అధికార పార్టీ నిర్వాకుడికి 10 లక్షల అందించి విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్ దృష్టికి సమస్య వెళ్లిన విచారణ పేరిట అధికారులు కాలయాపన చేయడం నిదర్శనమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ తొందరగా ముగించి ఉద్యోగులకు రావలసిన ఈపీఎఫ్, ఈఎస్ఐని చెల్లిస్తే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కానీ అధికారులు మాత్రం ఈ విధంగా స్పందించలేదా అని బాధితులు పేర్కొంటున్నారు.

More articles

Latest article