25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు

Must read

📰 Generate e-Paper Clip

బిచ్కుంద, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో బుధవారం ఉదయం నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ సోదాల విషయం జిల్లాలో కలకలం రేపింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు వాటిని వదలడానికి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయానికి సమీపంలోని సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ తో పాటు మరొక అధికారి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఏసీబీ తనిఖీల సమయంలో స్టేషన్ ఆవరణలో పది ఇసుక ట్రాక్టర్లను గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ సంబంధిత ట్రాక్టర్లను వదలకుండా యజమానులతో బేరసారాలు సాగించారని ఆరోపణలున్నాయి. ఈ విషయంలోనే సంబంధిత రిపోర్టును తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. అవినీతి, అక్రమాల విషయంలో ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. బిచ్కుంద ఏరియాలో మంజిరా నది నుంచి ఇసుక అక్రమ రవాణా విషయంలో మామూళ్ళ పై కొందరు సమాచారం ఇస్తున్నప్పటికీ ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు నిర్భయంగా టోల్ ఫ్రీ నంబర్ కు గానీ తమకు నేరుగా ఫిర్యాదు చేసినా బాధితుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు.

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు పోలీసు శాఖలో కలవరం రేపాయి. ఎందుకంటే గత మూడు నెలల క్రితం కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంతిభద్రతలను గాడిలో పెట్టడంతో పాటు అధికారుల అవినీతి, అక్రమాలపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. కామారెడ్డి జిల్లాలో గత ఆరు నెలల కాలంలో లింగంపేట్ పోలీస్ స్టేషన్ లో ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి చిక్కారు. అదీచాలదన్నట్లు అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ రాజేశ్ చంద్ర సస్పెండ్ చేశారు. కామారెడ్డి ఎస్పీ వ్యవహర శైలి పోలీసు శాఖ అధికారులకు ముచ్చెమటలను పట్టిస్తున్నాయి. అయితే కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ చూసుకుని రెచ్చిపోతుండగా వారి పై ఏసీబీ నజర్ ఉందని బుధవారం నాటి అవినీతి నిరోదక శాఖ ఆకస్మిక తనిఖీలో వెల్లడయింది.

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడికి కారణాలు అనేకంగా చెబుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో పోలీస్ స్టేషన్ బిచ్కుంద ప్రాంతానికి కీలకమైంది. గుట్కా, గంజాయి అక్రమ రవాణాతో పాటు నిషేదిత మత్తు పదార్థమైన అల్ప్రాజోలం దందా బిచ్కుందలో జోరుగా సాగుతుంది. అక్కడ పోలీసు అధికారులు ఆయా దందాల నిర్వాహులతో మామూళ్ళకు తెరలేపి విధి నిర్వహణ చేస్తున్నారని ప్రధాన ఆరోపణ. సహజ సిద్దంగా ఉన్న మంజిరా నది నుంచి జరిగే ఇసుక అక్రమ రవాణా పోలీసులకు లక్షల రూపాయలు లంచాలను తెచ్చిపెడుతుందనేది బహిరంగ రహస్యం. అక్కడ పోస్టింగ్ ల కోసం ప్రజాప్రతినిధుల సిఫారసుల ద్వారా వచ్చినా అధికారులు తర్వాత రెచ్చిపోవడం సర్వసాధారణమైంది. అక్కడ వచ్చే మామూళ్ళతో పాటు మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలో సివిల్ పంచాయితీలకు అడ్డాలుగా మార్చారని ఈ విషయంలో గతంలో పని చేసిన జిల్లా సూపరింటెండెంట్ కు ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలయ్యాయనేది ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతంలో స్థానిక పోలీసులది ఆడిందే ఆట.. అడిగిందే మూట అన్న పరిస్థితి ఉంది. అందుకే ఏసీబీ రైడ్ లో ఆకస్మిక తనిఖీలు అని ఏసీబీ డీఎస్పీ కుండబద్దలు కొట్టారు.

More articles

Latest article