కామారెడ్డి, బతుకమ్మ : పోగొట్టుకున్న 130 సెల్ ఫోన్లను స్పెషల్ డ్రైవ్ ద్వారా రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 130 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వాటిని బాధితులకు అప్పగిస్తామని తెలిపారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే అది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయినా లేదా చోరీకి గురైనా వెంటనే సంబంధిత పోలస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. సిమ్ కార్డ్ బ్లాక్ చేసి అదే నెంబర్ గల కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు. పోయిన మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ వివరాలు సీఈఐఆర్ వెబ్ సైట్ లో బ్లాక్ చేయడం వల్ల పోగొట్టుకున్న మొబైల్ సులభంగా దొరికే అవకాశం ఉందన్నారు. పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్ పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్ఎస్ఐ, 10మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గత మూడు రోజుల్లో ఆ టీం 130 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఫోన్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన టీం సభ్యులను అభినందించారు.

