జిల్లా జడ్జి భరత లక్ష్మీ
నిజామాబాద్, బతుకమ్మ : బార్ అండ్ బెంచ్ సమన్వయంతో కలిసి వెళితే విజయాలు వెంటబడి వస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి.ఎన్ భరత లక్ష్మీ అన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ జిల్లాకోర్టు ఆవరణలో నిర్వహించిన వార్షిక దినోత్సవం లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యనిర్వాహక వర్గపు అధిపతులు జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు కమిషనర్ లు న్యాయపాలికలో పాలుపంచుకుంటున్న తీరు ఆదరణీయమని అన్నారు.జిల్లాకోర్టు ప్రాంగణంలో రెండు లిఫ్టులు పనిచేయడం లేదని వాటి స్థానంలో నూతన లిఫ్టులకుగాను నలభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. న్యాయవాదుల ఆదరణ అవసరమని పేర్కొన్నారు. న్యాయమూర్తులుగా మీ ఊరికి అతిథులుగా వచ్చామని, మాకు కుటుంబం లేదని,ఒంటరి వాళ్లమని అన్నీను ఇక్కడివారేనని అక్కున చేర్చుకోవాలని కోరారు. బార్ అధ్యక్షుల ప్రసంగంలో నన్ను అమ్మలా తోడు ఉన్నమన్నందుకు నా కన్నపేగు కదిలిందని జిల్లాజడ్జి భరత లక్ష్మీ తన అనుభూతిని వ్యక్తం చేశారు. అమ్మ అనే పదానికి మించిన అమృతం ఏమున్నదని ఆమె అన్నారు. నిజామాబాద్ మొదటి అదనపు జిల్లాజడ్జి కనక దుర్గ మాట్లాడుతూ కష్టించి కలిసి వెళ్తేనే విజయాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ న్యాయవాదులు పోలీసు శాఖకు మద్దతుదారులుగా నిలవాలని ఆకాక్షించారు .సైబర్ క్రైమ్,సోషల్ మీడియా క్రైమ్ ,నేరాల తీరు మారుతున్నది వాటిని అధ్యయనం చేయాలని కోరారు. న్యాయవ్యవస్థ మరింత ఎదగాలని అందరం వసుధైక కుటుంబంలా జీవించాలని ఆయన తెలిపారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ ల సహకారం తీసుకుని జిల్లాకోర్టులో మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుంటామని తెలిపారు. బార్ వార్షిక దినోత్సవ వేడుక విశిష్టత ను బార్ ప్రధాన కార్యదర్శి మానిక్ రాజు తెలిపారు.కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జి టి. శ్రీనివాస్,సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావు,జూనియర్ సివిల్ జడ్జీలు కుష్బూ ఉపాధ్యాయ్, గోపికృష్ణ,హరి కుమార్, శ్రీనివాసరావు ,బార్ ఉపాధ్యక్షుడు దిలీప్,సంయుక్త కార్యదర్శి ఝాన్సీరాణి, కోశాధికారి నారాయణ దాసు,సీనియర్ న్యాయవాదులు టక్కర్ హన్మంత్ రెడ్డి,నరసింహ రెడ్డి,ఆకుల రమేశ్,ఎర్రం గణపతి, పిట్లం శ్రీనివాస్,జె.వెంకటేశ్వర్, రమాదేవి,తదితరులు పాల్గొన్నారు.
