- కోర్టు కానిస్టేబుల్ సస్పెన్షన్
- యూపీఏ ఎఫెక్ట్ తో వేటు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీసు బాసు వేట మొదలైందని చర్చ జరుగుతుంది. గురువారం ఉదయం నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ కోర్టు కానిస్టేబుల్ గజానంద్ జాదవ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు నెలల క్రితం నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సాయిచైతన్య తొలిసారిగా బోధన్ రూరల్ సిఐకి చార్జి మెమోతో తన పనితనాన్ని ప్రారంభించారు. తర్వాత కాలంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వరుసగా ఆపరేషన్ టప్పాచబూత్రతో పాటు ఫుట్ పెట్రోలింగ్ తో పాటు మైనర్ల డ్రైవింగ్ కు చెక్ పెట్టారు. అదే విధంగా రాత్రి 10:30 తర్వాత జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రాలుగా ఉన్న హోటళ్ళు, పాన్ షాప్ ల అడ్డాలపై నజర్ వేశారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో యజమానులను జైలుకు పంపించి హడలెత్తించారు. తాజాగా నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ కోర్టు మున్షి చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదులతో పాటు ఏకంగా సొంత పోలీసు కానిస్టేబుళ్లే ఫిర్యాదు చేయడంతో ఆయన చర్యలకు సిద్దమయ్యారు. ప్రధానంగా 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పోక్సో కేసులో పోలీసులు సీజ్ చేసిన కారును కోర్టు ద్వారా రిలీజ్ చేయించడంలో కానిస్టేబుల్ గజానంద్ డబ్బులు డిమాండ్ చేయడం, వారు సంబంధిత డబ్బులను యూపీఏ చెల్లింపులు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. స్పెషల్ బ్రాంచ్ అధికారులు జరిపిన విచారణలో కానిస్టేబుళ్ళు చీటీల నిర్వాహణతో పాటు తాను తీసుకున్న వ్యక్తిగత రుణాలకు షూరిటీలుగా ఉన్న సొంత కానిస్టేబుళ్లను వేదించడం, రికవరి సిబ్బందిని బెదిరించిన ఘటనలపై కేసులు నమోదు కావడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కోర్టులో జప్తు చేయబడిన వాహనాన్ని రిలీజ్ విషయంలో యూపీఏ ద్వారా రూ.2 వేలు ఆన్ లైన్ చెల్లింపుల ఎఫెక్ట్ తో కానిస్టేబుల్ ఉన్నఫళంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతుంది. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తొలి వేటు కానిస్టేబుల్ పైనే కావడంతో భవిష్యత్తులో పై అధికారులకు హెచ్చరికగా చెబుతున్నారు. ఇప్పటికే కొందరు పోలీస్ స్టేషన్ లలో దళారులను పెట్టుకుని వారి ద్వారానే స్టేషన్ లను సివిల్ సెటిల్ మెంట్ల పంచాయతీలకు అడ్డాలుగా మార్చారని ఇసుక, మొరం అక్రమ రవాణాదారులతో కుమ్మకై కేసులు నమోదు చేయకుండానే వసూళ్ళు చేయడంపై చర్చ మొదలయింది. అదే విధంగా భూముల పంచాయతీలో వడ్డీలకు ఇచ్చిన డబ్బులను రికవరికి పోలీసులే ముందుండి రికవరి చేస్తున్న వ్యవహరాలపై సీపీ సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. గతంలోనూ ఇదే వ్యవహరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. వారిపై కూడా త్వరలోనే చర్యలు ఉంటాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
