నిజామాబాద్, బతుకమ్మ : కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వ కృషి చేస్తుందని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నరాల రత్నాకర్ అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్ టీయూసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన మే డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నరాల రత్నాకర్ మాట్లాడుతూ కార్మికుల శ్రమ మీదనే సంపద సృష్టించబడుతుందని, శ్రామికులకు గుర్తింపుగా మేడే నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు, భవన నిర్మాణ కార్మికులకు, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం చట్టాన్ని రూపకల్పన చేస్తుందన్నారు. సీనియర్ నాయకులు జావేద్ అక్రమ్ మాట్లాడుతూ కార్మికులందరూ సంఘటితంగా ఉండి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ఐఎన్ టీయూసీ నాయకులు మల్యాల గోవర్ధన్, ధ్యారంగుల కృష్ణ, మున్సిపల్ యూనియన్ నాయకులు మారుతి, ఆటో యూనియన్ నాయకులు రెహమత్, కొరియర్ డెలివరీ బాయ్స్ నాయకుడు జమీర్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.
