- రౌండ్ టేబుల్ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీల నాయకులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కర్రె గుట్ట నుండి పోలీసు బలగాలను ఉపసంహరించాలని, ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని,కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కమ్యూనిస్టు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని కోట గల్లీలోనీ నీలం రామచంద్రయ్య భవన్ లో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య,సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు,సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ సిపిఐ జిల్లా నాయకులు ఓమయ్య, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి,రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ దేశ ప్రజలపై యుద్ధం చేస్తుందని వారన్నారు. తెలంగాణ చతిస్గడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో కర్రెగుట్ట వద్ద పోలీస్ సైన్యాలను దించి మావోయిస్టుల పేరుతో ఆదివాసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గ్రామాల నుండి తరలించే లక్ష్యంగా పనిచేస్తుందని వారు ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రకృతి సంపద ఖనిజ సంపదపై కార్పొరేట్ అధిపతులు అంబానీ ,ఆదాని,మల్టీ నేషనల్ కంపెనీలు కన్నేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారని వారన్నారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి,ప్రజల దృష్టిని మరల్చడానికి అనేక కుయుక్తులు పన్నుతుందని వారు తెలిపారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను బహిరంగ వేలం వేయడానికి నాలుగు లేబర్ కోడ్లచట్టం పేరుతో మరణ శాసనం విధిస్తోందని వారన్నారు. అన్నదాత రైతన్నను కూలీలుగా మార్చే కుట్రలో భాగంగా భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కించడానికి వ్యవసాయ వ్యతిరేక 3 నల్ల చట్టాలను మోడీ సర్కార్ తెచ్చిందని,రైతాంగా ప్రతిఘటనతో తాత్కాలికంగా వెనక్కి తగ్గిందని వారు తెలిపారు. కర్రెగుట్ట నుండి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకొని,శాంతి చర్చలకు ముందుకు రావాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వేల్పూర్ భూమయ్య ,దాసు,సిపిఎం శ్రీనివాస్,మాస్ లైన్ నాయకులు సుధాకర్,సిపిఐ నాయకులు విటల్ గౌడ్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, ఉపాధ్యక్షులు మల్లికార్జున్, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం,తదితరులు పాల్గొన్నారు.
