27.3 C
Hyderabad
Friday, July 31, 2026

పద్మశ్రీ బండి రామకృష్ణారెడ్డి కన్నుమూత

Must read

హైదరాబాద్, బతుకమ్మ :  ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య బండి రామకృష్ణారెడ్డి (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం  రాత్రి హైదరాబాదు డీఆర్డీఏ సమీపంలోని అపోలో ఆసుపత్రిలో రామకృష్ణారెడ్డి కన్నుమూసినట్టు ఆయన మేనల్లుడు యోగి వేమన విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యులు డా. ఎన్.ఈశ్వర రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలోని రెంటాల చేను గ్రామంలో జన్మించిన రామకృష్ణారెడ్డి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో  ఎం.ఏ. హిందీ, పూణెలోని డెక్కన్ కాలేజీలో ఎం.ఏ భాషాశాస్త్రం చదివారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అన్నామలై విశ్వవిద్యాలయం మరియు సీఐఐఎల్ మైసూర్‌లో పనిచేశారు. ఆ తర్వాత కామన్వెల్త్ ఫెలోషిప్ పై యూకే వెళ్లి ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆండర్సన్ కేస్ గ్రామర్‌పై పీహెచ్‌డీ పట్టా సాధించారు. 1977లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని భాషాశాస్త్ర విభాగంలో లెక్చరర్‌గా చేరి, తర్వాత ప్రొఫెసర్ అయ్యారు. 1990లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరి అక్కడే భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా విధులు నిర్వర్తించారు. తదనంతరం అదే  విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా పనిచేశారు. ఆ తర్వాత కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపక రిజిస్ట్రార్‌గా సేవలందించారు. ఆయన అనేక గిరిజన భాషలపై పనిచేసి, భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన ఇండి-ఆవే భాషకు లిపి  తయారు చేశారు. ఆయన తన వృత్తి జీవితంలో ద్రావిడ భాషా వేత్తల సంఘం (డీఎల్‌ఏ)తో చురుకుగా సంబంధం కలిగి అనేక పరిశోధన పత్రాలను ప్రచురించారు. విద్యార్థులకు స్నేహపూర్వకంగా ఉంటూ, పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేశారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article