నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వడ్డీ వ్యాపారం పై పోలీస్ శాఖ నజర్ వేసింది. ఇటివల ఆర్మూర్ పట్టణంలో అధిక వడ్డీతో పాటు తనఖా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారుల ఇండ్లలో పోలీస్ శాఖ తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని చోట్ల అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు… వడ్డీ వ్యాపారం ( లీగల్ దందా ల ముసుగులో) నిర్వహిస్తున్న వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో నగరంలోని పలు స్టేషన్ ల పరిధిలో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న పలువురు ఇండ్లలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించారు. నిజామాబాద్ ఎసీపి రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని సిఐలు, ఎస్ఐలు, ఎఆర్ సిబ్బందితో కలిసి రెండు పోలీస్ స్టేషన్ ల పరిధిలో వ్యాపారుల ఇండ్లలో, కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. పలువురు ఇండ్లలో డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
నో మార్టిగేజ్….. ఓన్లీ సెల్ డీడ్
నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారంను వ్యాపారులు లీగలైజ్ చేసుకున్నారు. న్యాయ పరంగా చిక్కులు ఎదుర్కోకుండా ఉండేందుకు, పోలీసులు కేసులు అంటు కోర్టు చుట్టూ తిరగకుండా నో మార్టిగేజ్… ఓన్లీ సెల్ డీడ్ దందాకు తెరలేపారు. ఒకప్పుడు వడ్డీ వ్యాపారం కొందరికి పరిమితం కాగా ఇప్పుడు డాక్టర్లు , వ్యాపారులు, పైనాన్స్ వ్యాపారులు, రియల్టర్లు ఈ దందాలో మునిగి తేలుతున్నారు. ప్లాట్లు, వ్యవసాయ భూములు, ఇండ్లు కుదువ పెట్టుకోవడం లేదు డైరెక్ట్ సెల్ రిజిస్ట్రేషన్ చేస్తే వడ్డీకి డబ్బులు ఇచ్చే కల్చర్ షూరు చేశారు. వడ్డి కట్టలేకపోయిన, వాయిదాల చెల్లింపులో జాప్యం జరిగిన తమవద్ధ ఉన్న భూములు అలాగే సెల్ డిడ్ ఉండటంతో కబ్జాకు తెరలేపుతున్నారు. నిజామాబాద్ బైపాస్ లో పేరు మోసిన పిజీషీయన్ వైద్యుడు, ఒక కూల్ డ్రింక్ వ్యాపారీ 120 మంది సాధారణ పౌరులు కొనుగోలు చేసిన వెంచర్ కి వడ్డికి డబ్బుల కోసం చేరబట్టారు. పోలీస్ కేసు, కోర్టు కేసు నమోదైన ఇప్పటికే బాధితులకు న్యాయం జరుగలేదు. వడ్డీ వ్యాపారులు స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరింపులు దిగిన ఉదంతాలు ఉన్నాయి. పోలీస్ శాఖ జిల్లాలో వడ్డీ వ్యాపారం పై ఉక్కుపాదం మోపుతున్న లేక సెల్ డీడ్ దందాపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే చర్చ జరుగుతుంది.

