- ట్రిమ్స్ సమీపంలో సర్కారు భూమి కబ్జాకు దుస్సాహాసం
- పేలుడు పదార్థాలతో హాస్టల్ వద్ద బండరాళ్ళ పేల్చివేత
- భయం భయంగా గడుపుతున్న విద్యార్థులు
- సర్కారు భూమి కబ్జా వెనుక పెద్దలెవరు?
- చోద్యం చూస్తున్న యంత్రాంగాలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ లో సర్కారు భూమి కబ్జా కోసం బరితెగించారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు ఆనుకుని ఉన్నభూమిని చెరబట్టేందుకు అందులో ఉన్న బండరాళ్లను పేలుడు పదార్థాలతో పేల్చివేశారు. వందల మంది విద్యార్థులు హాస్టల్ లో ఉండగానే ఈ ఘటన జరుగడం గమనార్హం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ భూమిగా అధికారులు నిర్ధారించి బోర్డులు ఏర్పాటు చేసిన భూమిని చెరబట్టేందుకు స్థానికంగా ఉన్న అధికార పార్టీ లీడర్లతో పాటు రౌడిషీటర్లు ప్రయత్నించగా వారికి రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు వెన్నుదన్నుగా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిజామాబాద్ నగరంలోని 12, 13వ డివిజన్ సరిహద్దులో సర్వే నంబర్ 249లో సర్కారు భూమి ఉంది. గతంలో అక్కడ స్థానికంగా స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించారు. మిగిలిన స్థలం కబ్జాకు ప్రయత్నాలు జరుగడంతో గత కలెక్టర్ నారాయణరెడ్డి, అప్పటి సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబంధిత భూమి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఉత్తర మండల తహసీల్ధార్ ఆధ్వర్యంలో బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ మిగిలిన సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు రౌడిషీటర్ తో కలిసి కబ్జాకు పన్నాగం పన్నారు. ఇటీవల మూడు రోజులుగా సంబంధిత భూమిలో కబ్జా చేసేందుకు అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను పెకిలించేశారు. బండరాళ్ళను పేలుడు పదార్థాలతో పగులగొట్టారు. ప్రస్తుతం మార్కెట్లో కోట్ల విలువ చేసే భూమి కావడంతో కబ్జా చేసేందుకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలను అక్కడికి రాకుండా ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి.

- ప్రభుత్వ భూమి కబ్జా గురించి తెలిసి వివరాలు సేకరిస్తున్నాం : నాగార్జున (నార్త్ తహసీల్ధార్)
నిజామాబాద్ నార్త్ మండలంలోని ధర్మపురి హిల్స్ లో స్మశాన వాటిక వద్ద ట్రిమ్స్ సమీపంలో సర్కారు భూమిని కబ్జా చేస్తున్నారని కొందరు సమాచారం ఇచ్చారు. బుధవారం డిప్యూటీ తహసీల్ధార్ తో పాటు సర్వేయర్ ను అక్కడికి పంపించి వివరాలు సేకరించారు. సంబంధిత వివరాల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ భూమిలో బండరాళ్ళను పేల్చిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాం.

