28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తులం బంగారం ఇస్తామని మోసం చేశారు

Must read

📰 Generate e-Paper Clip

. ఉచిత బస్సు అని.. బస్సుల సంఖ్యను పెంచలేదు
. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి
. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు
జగిత్యాల, బతుకమ్మ: మోసం చేయడం, బెదిరించడం కాంగ్రెస్ వారికి కొత్త కాదని, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని ప్రకటించి మోసం చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జగిత్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశానికి కవిత హాజరై ప్రసంగించారు.

ఉచిత బస్సు అమలు చేస్తున్నామని చెప్పి బస్సుల సంఖ్య పెంచకపోవడంతో సీట్లు దొరకని పరిస్థితి ఉందని, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ, రైతుభరోసా ఇంకా 50శాతం మందికి రానేలేదని, గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని కవిత పిలుపునిచ్చారు. అలాగే బీజేపీ మోసపూరిత విధానాలను ప్రజల్లో తీసుకెళ్లాలని అన్నారు.

పసుపు బోర్డును తూతూ మంత్రంగా ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. ఫలితం బోర్డుకు బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. పసుపు ధరలు పడిపోతే బోర్డు ద్వారా రైతులకు డబ్బులు ఇస్తామని మంత్రి బండి సంజయ్ ప్రకటించారని, మరి రైతులకు ఇచ్చారని ప్రశ్నించారు. రెండుకోట్ల ఉద్యోగాలు, బోర్డుకు చట్టబద్ధత, ఒక్కొక్కరికి రూ.15లక్షలు ఏమయ్యాయని అడిగితే ఎంపీ అర్వింద్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని కవిత విమర్శించారు. ఆయన ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడిన దాఖలాలు లేవన్నారు.

తెలంగాణను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే..
తెలంగాణను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రజతోత్సవ సభ గులాబీ పండుగ మాత్రమే కాదని, ఇది తెలంగాణ పండగ అని ఆమె అన్నారు. గ్రామ కమిటీల్లో ప్రతి వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని సూచించారు.

సంజయ్ బీజేపీలో చేరారా? కాంగ్రెస్ లో చేరారా?
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎంపీ అర్వింద్ కలిసి ఢిల్లీలో తిరుగుతున్న వార్తలను టీవీల్లో చూశానని, సంజయ్ బీజేపీలో చేరారా? లేదా కాంగ్రెస్ లో చేరారా? అని కవిత ప్రశ్నించారు. సంజయ్ ఓ సారి సీఎం రేవంత్ రెడ్డితో, మరోసారి బీజేపీ వాళ్లతో కనిపిస్తారని ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొందని అన్నారు. జగిత్యాలకు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ విఫలమయ్యారని, ఆయను గ్రామాల్లో నిలదీయాలని పిలుపునిచ్చారు.

More articles

Latest article