- తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్(సి) సరిత పిట్ల
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వివక్షత లేని విద్యా విధానానికి పోరాడాలని తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్(సి) సరిత పిట్ల అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార ఇండియన్ ఐన్స్టీన్ , ఇండియన్ చేగువేరా గా పేరు గాంచిన అమరవీరుడు జార్జిరెడ్డి 53వ వర్ధంతి సభను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్. యు) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సరిత పిట్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ లలో, కాలేజీలో , మహిళా విద్యార్థుల పట్ల, పేద, మధ్యతరగతి విద్యార్థుల పట్ల వివక్షతను, దాడులను, హాస్టల్లో, కాలేజీల్లో, నగరంలో ప్రజల మధ్య వివక్షతను కల్లారా చూసిన వ్యక్తి వాటికి వ్యతిరేకంగా పోరాడి వివక్షత లేని విద్య అందినప్పుడే సమాజం ఆరోగ్యకరమైనటువంటి సమాజం రూపుదిద్దుకుంటుందని పోరాడిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. ఒక్క కాలేజీలోనే కాకుండా హైదరాబాద్ నగరంలోనీ చాలా బస్తీల్లో ఉన్న ప్రజల ఇండ్లను గుండాలు కబ్జా చేయాలని చూస్తే తరిమికొట్టిన చరిత్ర జార్జి రెడ్డి ది అన్నారు. జాతీయం అంతర్జాతీయ రాజకీయాలను ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తూ చేగువేరా , భగత్ సింగ్ స్పూర్తి తో అటు చదువులో న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) లో ఉద్యోగం వచ్చిన వదులుకొని ఈ సమాజ మార్పు కోసం, విద్య విధానం మారాలని, శాస్త్ర విద్య కావాలని పోరాడని అన్నారు. విద్యలో కుల వివక్షత, మత వివక్షత , ఆర్థిక అసమానతలు పోవాలని , విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలని పోరాడిన వ్యక్తి జార్జ్ అని కొనియాడారు. సాంకేతిక రంగం నేడు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే నేటి పాలకులు మూఢనమ్మకాలు, జ్యోతిష్య శాస్త్రాలను పాఠ్యపుస్తకాలు చేర్చడానికి తహతహలాడుతున్నారని విమర్శించారు. విద్య వ్యవస్థను ఇంకా వందేళ్లు వెనుకకు నెట్టడానికి పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయడానికి ఇలాంటి విధానాలను విద్యలో జోపించడానికి కుట్రలు చేస్తున్నారని దిన్ని విద్యార్థులు అర్థం చేసుకొని విద్యార్థి వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. సినిమా నటి, నటులకు, ఐపీఎల్ లో ఆడే క్రీడాకారులకు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అలాంటి వారిని కాదు మనం తీసుకునేది , ఒక భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, జార్జిరెడ్డి, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే లాంటి ఎంతో మంది మేధావులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మాజీ పి డి ఎస్ యూ నాయకులు జి.రమేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పి డి ఎస్ యూ విద్యార్థి సంఘం అనేక పోరాటాల నిర్వహించి మెడికల్ కళాశాల, తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు మరియు అనేక సంక్షేమ హాస్టల్స్ సాధించుకోవడం జరిగిందని అన్నారు. మాజీ పి వై ఎల్ నాయకులు సాయిబాబా విద్యార్థులు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి , సమాజంలో ప్రతి విద్యార్థి ప్రశ్నించే విధంగా తయారవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్,జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్,జిల్లా నాయకులు నిఖిల్, హుస్సేన్,రాహుల్, మరియు నగర నాయకులు సాయికిరణ్, ప్రజాసంఘాల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

