తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
కేటీఆర్ అరెస్టు కావాల్సిందే
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, బతుకమ్మ : ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, 15 మాసాల్లో ప్రజాపాలన మార్పు చూపించగలిగామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. కేసిఆర్ కుటుంబ సభ్యులు దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం గా మార్చి ఎగుమతి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయంలో కేసిఆర్ ప్రమేయంతోనే పెద్ద ఎత్తున రైస్ స్కాం జరిగిందని ఆరోపించారు. సన్న బియ్యం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. ధరణి తో విసిగిపోయిన ప్రజలకు భూభారతి తో మోక్షం కలగనుందన్నారు. ప్రజలకు మేలు జరిగే విధంగా భూభారతి ఉంటుందన్నారు. కేసీఆర్ కుటుంబం ఆర్ధిక దోపిడీ చూసి భయపడి కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కేటీఆర్ అరెస్టు కావాల్సిందే అన్నారు. మంగళవారం సీఎల్పీ సమావేశం నోవేటెల్ లో జరగనుందన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తిగతమన్నారు. మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణ,కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నాయకులు వినోద్ రెడ్డి, ఏనుగు రవీందర్, కైలాష్ కుమార్, సిద్దేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
