నేడు స్వామి వారి కల్యాణం
ఒంటిమిట్ట, బతుకమ్మ : ఏపీలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను, పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి, కుటుంబ సభ్యులు శుక్రవారం విరాళంగా అందించారు. దాదాపు 7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ మాఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులకు దాత అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ కిరీటాలను శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అలంకరించారు.
జర్మన్ షెడ్ డిజైన్ తో కల్యాణ వేదిక నిర్మాణం
శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం జర్మన్ షెడ్ డిజైన్ లో కల్యాణ వేదిక నిర్మించారు. 2500 మంది టీటీడీ సిబ్బందితో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 130 సీసీ కెమెరాలు, 7 డ్రోన్ లతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దంపతులు సమర్పించనున్నారు. లక్ష మంది భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
