29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అడ్డగోలుగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

. అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు
. కలెక్టర్ తోపాటు ఏసీబీకి ఫిర్యాదులు

కామారెడ్డి, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక అడ్డగులుగా జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీల ఎంపిక కోసం గత నెల 18వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తూ అందులో నియమనిబంధనలను స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తరువాత పలు ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోగా, కనీస అర్హతలు లేని ఏజెన్సీలను అధికారులు ఎంపిక చేయడం వెనుక మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు.

ఆరోపణలు ఇవీ..
అధికారులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా కనీసం 3శాతం కన్నా ఎక్కువ కోట్ చేసిన ఏజెన్సీలను ఎంపిక చేయాల్సి ఉండగా 3శాతం కన్నా తక్కువ కోట్ చేసిన ఏజెన్సీలను ఎంపిక చేశారు. ఏజెన్సీలు అందజేసిన దరఖాస్తులపై ఎక్కడా కూడా సంతకాలు లేకున్నప్పటికీ జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి సెలవు రోజున ఏజెన్సీల నిర్వాహకులను తన కార్యాలయానికి పిలిపించుకుని వారితో సంతకాలు చేయించుకున్నారు. అవసరమైన ధ్రువపత్రాలను జత చేయించకున్నారు.

ఏజెన్సీల సర్వీస్ ఎక్స్ పీరియన్స్, లేబర్ లైసెన్స్, ఆడిట్ రిపోర్టు, స్థానిక కార్యాలయాల అడ్రస్ లు లేకున్నా ఎలాంటి విచారణ లేకుండా ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. వికాస్, ప్రణయన్, పల్లాడ్లస్ తదితర ఏజెన్సీలు మూడుశాతం కన్నా తక్కువ కోటు చేసినా వీటిని ఎంపిక చేశారు. టెండర్లను నిబంధనల ప్రకారం దరఖాస్తుదారుల సమక్షంలో ఓపెన్ చేయాల్సి ఉండగా ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే ఓపెన్ చేశారు. ఏజెన్సీల అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. దరఖాస్తులపై జిల్లా ఉపాధి కల్పనాధికారి సంతకం చేయాల్సి ఉండగా..

ఏ ఒక్క దరఖాస్తుపై సదరు అధికారి సంతకం చేయలేదు. పూర్తిస్థాయిలో ఏజెన్సీల ఎంపిక పూర్తయిన తరువాత ఆయా ప్రభుత్వ శాఖలను ఏజెన్సీలకు కేటాయించాల్సి ఉండగా, ఈ ప్రక్రియను చేపట్టకుండానే హుటాహుటిన ఏజెన్సీలకు శాఖలను కేటాయించారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి తన అనుకూలురైన వారినే ఎంపిక జాబితాలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ విధంగా ఏజెన్సీల ఎంపికపై అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారోననేది చర్చనీయాంశమైంది. ఏజెన్సీల ఎంపికలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ పలువురు ఇప్పటికే ఏసీబీకి సైతం ఫిర్యాదు చేశారు.

More articles

Latest article