- ప్రజల అండ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీస్తాం
- కేసీఆర్ నాట్లు అప్పుడు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్ల అప్పుడు వేస్తున్నాడు
- పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్, బతుకమ్మ : కేసీఆరే తెలంగాణ కు శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే రెసిడెన్స్ కార్యాలయంలో వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి సాధరంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారిని ఆహ్వానించారు. అ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసపూరిత,కక్ష్యపూరిత పరిపాలన చేస్తుందన్నారు. ఓట్లకోసము ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి, ఆరు గ్యారంటీల ద్వారా అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని తెలిపారు. 100 రోజుల్లోనే హామీల అమలు అని,కొన్ని డిసెంబర్ 9 నాడే అమలు చేస్తాం అని ఇప్పుడు 500 రోజులైన ఒక్క హామీ సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు,కోపానికి నిదర్శనం అని అన్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా మాట్లాడుతూ వెంటనే రుణం తెచ్చుకోండి మేము రాగానే వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మేము రుణమాఫీ పూరిగా చేసేసాం అని ఇక చేయాల్సింది లేదు అని అంటున్నారని అన్నారు. రైతు బంధు బీఆర్ఎస్ ఎకరానికి సంవత్సరం కు 10 వేలు ఇస్తే మేము వస్తే 15000 ఇస్తాం అన్నారని ఇప్పుడు 12 వేలు చేశారని ఎద్దేవా చేశారు. ఆ రైతు బంధు కూడా యసంగి కి గత ప్రభుత్వం రెడీగా ఉంచిన డబ్బులు పంచి,వానాకాలం పూర్తిగా ఎగ్గొట్టి ఇప్పుడు యసంగి కి అరకొర మంది రైతులకు మాత్రమే వేశారన్నారు. రైతుబందు మార్చి 31 లోపు వేస్తా అన్న రేవంత్ రెడ్డి పంచాయతీ ఎలక్షన్ లు వస్తున్నాయని ఇప్పుడు వేస్తున్నాడని తెలిపారు. కేసీఆర్ నాట్లు అప్పుడు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్ల అప్పుడు వేస్తున్నాడని అన్నారు.
