నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్భాగంగా 5వ రోజు అశ్వవాహనంపై శ్రీనివాసుడు మాడ వీధుల్లో ఊరేగాడు. శ్రీవారి కళ్యాణం అనంతరం అమ్మవారిని తీసుకెళ్తున్న శ్రీవారిని దోచుకునే ప్రయత్నంలో “చివరి ఆళ్వార్ తిరుమంగై అళ్వారు” వారికి కనువిప్పు కలిగే ఘట్టాన్ని భక్తులు నృత్య రూపంలో చూసి తన్మయత్వనికి లోనయ్యారు. స్వామి వారి కీర్తనలపై ప్రముఖ నృత్య గురువులు విజయలక్ష్మీ ఆధ్వర్యంలో అద్భుతమైన నృత్య రూపకాలను సిద్ధార్థ కళాక్షేత్రం శిష్యులు ప్రదర్శించారు. సినీ నటులు రవి ఈ నృత్య రూపాకాల్లో నటించి భక్తులను అలరించారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ దేవనాథ జీయరు స్వామి వారు, గంగోత్రి రామానుజ స్వామి వార్లు ప్రవచించారు. అశ్వ వాహనం పై వచ్చిన శ్రీవారు సిరి సంపదలను తీసుకొని వస్తాడని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు సాయంత్రం పూర్ణాహుతి తరువాత అశ్వవాహనంపై మాడ వీధుల్లో ఊరేగిన తరువాత దోపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆళ్వారుల్లో చివరి ఆళ్వారు అయిన తిరుమంగై ఆళ్వారు జీవిత చరిత్రను “దోపోత్సవంగా” (దోపిడి ఉత్సవం) ప్రదర్శించారు. తిరుమంగై ఆళ్వారుగా మారిన పరకాలుని కథనే దోపోత్సవం. రాజుగా పరిపాలించిన పరకాలుడు కుముదవల్లి ప్రేమలో పడిన తరువాత 1008 మంది శ్రీ వైష్ణవులకు భోజనాలు ఏర్పాటు చేసి…. భోజనాల సదుపాయాలు ఏర్పాటు చేయడానికి తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోతే దారిదోపిడీలు చేస్తూ దోపిడీ దొంగగా మారిన తరువాత మహా విష్ణువు దర్శన భాగ్యతో ఆళ్వారుగా మారిన ఘట్టాన్ని దోపొత్సవంలో అద్భుతంగా చుపెట్టడంతో భక్తులు పరవశించిపోయారు. గ్రామానికి చెందిన ఆడబిడ్డలు మంగళ హారతులతో స్వామి వారిని ఆహ్వానించారు. గ్రామ యువత ఆట పాటలతో అశ్వవాహన ఊరేగింపులో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు శ్రీ శ్రీ శ్రీ దేవనాథ స్వామి వారు, గంగోత్రి రామానుజదాసు స్వాముల వారి మంగళా శాసనాలతో జరగడం పూర్వ జన్మ సుకృతం అని ఆలయ ధర్మకర్త శ్రీ నరసింహ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆచార్య గంగోత్రి రామానుజ దాస్ స్వామి. ధర్మకర్తలు దిల్ రాజు, నర్సింహారెడ్డి శిరీష్ విజయసింహా రెడ్డి, సిని నటులు రవి, మాజీ సర్పంచ్ సాయ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాములు, నరాస సుధాకర్, పృథ్వీ, నర్సారెడ్డి, ప్రసాద్, రమేష్, భాస్కర్, నరేందర్, గంగారెడ్డి, సాయిలు, మురళి, రవి సురేష్, అరవింద్, యాజ్ఞాచార్యులు శిఖామణి ఆచార్యులు సత్యన్నారాయణ ఆచార్యులు, శ్రీకర్ కుమారాచార్యులు, రోహిత్ కుమారాచార్యులు విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

