27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బ్యాంకులో రైతుల అర్ధనగ్న నిరసన

Must read

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్, బతుకమ్మ :  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో రైతులు అర్దనగ్న ప్రదర్శనతో తమ నిరసన వ్యక్తం చేశారు. తమ ఖాతాల్లో ఉన్న నగదు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బైఠాయించారు. రైతుల నిరసనతో బ్యాంకులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం రైతులు, బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడారు. బ్యాంక్ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది తాంసి మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన జిల్లెల మోహన్ కు ఒక లక్షా, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపలగూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్ కు రూ.76వేలు, అదే గ్రామానికి చెందిన నక్కల జగదీష్ కు రూ.2లక్షలు పత్తి పంటకు సంబంధించిన డబ్బులు పోస్టాఫీసు ఖాతాలో జమ చేశారని తెలిపారు. అయితే ఈ డబ్బులు జమ చేసిన వెంటనే సంబంధిత అప్పటి పోస్ట్ ఆఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ సైబర్ క్రైమ్ కు పాల్పడడం తో పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు.  ఈ క్రమంలో రైతులకు రావలసిన డబ్బులు సంబంధిత ఢిల్లీ బ్యాంక్ లో హోల్డ్ లో ఉన్నాయని వెల్లడించారు. అయితే కొంతమంది రైతులకు అప్పుడు జరిగిన ఆందోళనతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా జోక్యంతో డబ్బులు చెల్లించడం జరిగిందని, మరికొంత మంది రైతులకు చెల్లింపులు కాలేదని అన్నారు. ప్రస్తుతం రైతుల ఆందోళనతో సంబంధిత బ్యాంక్ అధికారులతో మాట్లాడటం జరిగిందని, త్వరలో రైతులకు రావలసిన డబ్బులు చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో రైతులు ఆందోళనను విరమించారు. ఇది ఇలా ఉంటే ముందుగా రైతులు ఏడాదిగా తిరుగుతున్న బ్యాంక్ అధికారులు మాత్రం తమను పట్టించుకోవడం లేదని,మా డబ్బులు మాకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపడంతో బ్యాంక్ లో గందర గోళం నెలకొంది. ఎట్టకేలకు బ్యాంక్ మేనేజర్ హామీ ఇవ్వడంతో పోలీసులు,అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాకుండా గత నెలలో జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంక్ లో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే మళ్ళీ ఏం జరుగుతుందో అని భయందోలనకు గురయ్యారు.

More articles

Latest article