. పర్సు పోయిందని ఫిర్యాదు చేస్తే లాఠీతో కొట్టాడు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తన పర్సు పోయిందని ఫిర్యాదు చేసిన మహిళను సీఐ లాఠీతో విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో చోటుచేసుకుంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన బోయ భాగ్య తన కుమారుడితో కలిసి ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు హాజరైంది. ఉత్సవాల్లో ఆమె పర్సు పోవడంతో అక్కడే ఉన్న పోలీసు అవుట్ పోస్టులో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబుకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన మహిళను దూషిస్తూ, అనవసరంగా రాద్ధాంతం చేస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు మహిళను లాఠీతో విచక్షణా రహితంగా చిత్తబాదాడు. ఒంటిపై ఆమెకు వాతలు వచ్చేలా కొట్టాడు. సీఐ విజయ్ బాబుపై ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. తను పనిచేసే సర్కిల్ పరిధిలోని పోలీసు స్టేషన్ లోనే విజయ్ బాబుపై ఫిర్యాదు అందింది.
సీఐపై చర్యలు తీసుకోవాలి
ఫిర్యాదు చేసిన మహిళను చితకబాదిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. బాధిత మహిళకు వెంటనే న్యాయం చేయాలని పేర్కొన్నారు.
