25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నాడు కళకళ..  నేడు వెలవెల

Must read

📰 Generate e-Paper Clip

  • నానాటికి పడిపోతున్న పాల పాకెట్లు
  • ఒకప్పుడు 18 వేలు, ఇప్పుడు 4 వేలు
  • పక్క జిల్లాలో పాల కోసం దేహి అంటూ …
  • ఇందూర్ పరువు తీస్తున్న డెయిరీ అధికారులు

 

నిజామాబాద్, బతుకమ్మ: నాడు కళకళ లాడిన నిజామాబాద్ లోని సారంగాపూర్ లోగల విజయ డెయిరీ నేడు వెలవెల బోతున్నది. ఒకప్పుడు 18 వేల లీటర్ల పాలను పాకెట్లుగా మార్చేసి విక్రయించేవారు. నేడు అధికారుల దైన్యం వల్ల రోజుకు 4 వేల లీటర్ల పాలను పాకెట్లుగా చేస్తున్నారు. ఇందులోనూ పక్క జిల్లా నుంచి దేహి అంటూ పాలను అడుక్కుంటున్నారు. రైతులతో ఒక వెలుగు వెలిగిన సారంగాపూర్ డెయిరీ ప్రస్తుతం అంధవిహీనంగా కనబడుతోంది.

  • నాడు కళకళ….

జిల్లా వ్యాప్తంగా డెయిరీకి ఉన్న సొసైటీల రైతులతో అప్పటి అధికారులు సత్సంబంధాలు నడిపారు. దీనితో విజయపై నమ్మకం కుదుర్చుకున్న పాడి రైతులు గ్రామాలలో వెలసిన కేంద్రాలకు పాలు పోసేవారు. మిల్క్ షెడ్ నుంచి రైతులకు కావాల్సిన పశు సామాగ్రితో పాటు ప్రోత్సాహకాలను అందజేసేవారు. అధికారులకు, రైతులకు మద్య స్నేహపూర్వకమైన బంధాలు బలపడడంతో సుమారు 30 వేల లీటర్ల పై చిలుకు సారంగాపూర్ డెయిరీకి పాలు వచ్చాయి. ఇక్కడ అమ్మకం కోసం పాకెట్లు తయారు చేయగా, మిగిలిన పాలను హైదరాబాద్ లోని ప్రధాన కేంద్రానికి పంపించేవారు.

  • నేడు వెలవెల…

దినదినాభివృద్ది పరచాల్సిన అధికారులు తమకు జీతం వస్తే చాలు అన్నట్లుగా విధులు నిర్వహిస్తున్నట్లు కనబడుతోంది. డెయిరీని లాభాల బాట పట్టించి రైతులను ఆర్థికంగా పరిపుష్టిగా చేయాలని ఉద్యోగస్తులను ప్రభుత్వం నియమిస్తుంది. నిజామాబాద్ సారంగాపూర్ లో దీనికి విరుద్దంగా పని చేస్తున్నట్లు కనబడుతోంది. పాలు నానాటికి పడిపోతున్నా సొసైటీల దగ్గరికి వెళ్లి మంతనాలు జరపడం లేదు. గతంలో నడిచిన బిఎంసిలను మూతపడేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్పల్లి మండలంలోని ఒక గ్రామంలో నిత్యం విజయ డెయిరీకే పాడి రైతులు పాలు పోసేవారు. అలాంటి కేంద్రాన్ని మూసివేయించిన ఘనత ప్రస్తుత అధికారులకే చెందుతుంది. బిఎంసిలతోపాటు గ్రామాల్లోని కేంద్రాలు సైతం మూతపడ్డాయని జిల్లాలో జగమెరిగినదే.

  • 18 వేల పాకెట్ల నుంచి..

గతంలో పాల పాకెట్లను తయారు చేయాలంటే ప్లాంట్ సిబ్బంది అమ్మో అనేవారు. ఇప్పుడు కనులు మూసి తెరిచేలోపు పాకెట్లను కొట్టేస్తున్నారు. ఇందులోనూ అడుక్కున్న పాలు ఉండడం విశేషం. అలాంటప్పుడు జీతాలు ఇచ్చి పని చేయించుకోవడం ఎందుకనే ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి. పాడి రైతులతో ఒకప్పుడు విలసిల్లిన మిల్క్ షెడ్ ప్రస్తుతం కునారిల్లుతోంది. విజయ డెయిరీని అభివృద్ధి పరచాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలుమార్లు సూచించడమే గాకుండా, చైర్మెన్ ను కేంద్రానికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే ముందు తల ఆడించి, ఆనక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోతున్నారు.

  • దేహి అంటూ ..అడుక్కుంటున్నారు …

రైతుల దగ్గరికి వెళ్లి విజయ డెయిరీకి పాలు పోయండని అడగడానికి మొహం చెల్లని అధికారులు, పాలు పంపించాలని పక్క జిల్లా వారిని దేహి అంటూ అడుక్కోవడం నిజామాబాద్ జిల్లా పరువు తీయడమేనని రైతులు కన్నెర్ర జేస్తున్నారు. వారు పంపించే పాలు సైతం చెడు వాసన ఉన్నవి, పాకెట్లు కొట్టడానికి వీలు లేనివి కావడంతో ఒకసారి నేలపాలు చేసారని సమాచారం. ప్రస్తుతం షెడ్ కు సుమారు మూడు వేల లీటర్ల పాలు వస్తున్నట్లు తెలిసింది. బోధన్ ఎమ్మెల్యే సూచన మేరకు కొనుగోలుదారులు ముందుకు రావడంతో అమ్మకాలు పెరిగాయి. దీనికి అనుకూలంగా పాల సేకరణ జరగడం లేదు. పాలు పెరిగితే పని ఒత్తిడి పెరుగుతుందని గ్రహించి, ఉన్న వాటిని మూసి వేసే విధంగా నాలుగు గోడల మద్య కూర్చొని సెల్ ఫోన్ చేత పట్టుకొని కుయుక్తులు పన్నుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి చేతగాని అధికారుల వల్లె పాల కేంద్రాలు విజయకు దూరమవుతున్నాయని, దీని వల్ల రైతులతో పాటు సంస్థ నష్టాల బారిన పడుతుందనే ఆందోళన రైతులలో మెలుగుతోంది.

More articles

Latest article