. రాష్ర్టంలో క్రైం రేట్ 20శాతం పెరిగింది
. తరచూ మత కల్లోలాలు చోటు చేసుకుంటున్నాయి
. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ: రాష్ర్టంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రైమ్ రేట్ 20శాతం పెరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన మహిళా శంఖారావం నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో నిర్వహించనున్న మహిళా శంఖారావానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆమె కోరారు. కాలేజీకి వెళ్లిన ఆడపిల్ల ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందని, భద్రత కోసం మహిళలు పోరాడాల్సి రావడం బాధాకరమని అన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు 2500 ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి మహిళలకు రూ.35 వేల చొప్పున బాకీ పడ్డారని, వెంటనే ఆ డబ్బులను మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ పై అక్కసుతో కేసీఆర్ కిట్ లను నిలిపివేశారని, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటున్న ప్రభుత్వం బస్సుల సంఖ్యను తగ్గించిందని విమర్శించారు.
రాహుల్ పారిపోయారు
వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని, హామీలపై ప్రజలు నిలదీస్తారనే తన పర్యటనను రద్దు చేసుకున్నారని కవిత ఎద్దేవా చేశారు. వరంగల్ డిక్లరేషన్ పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇక్కడి కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదని ఎన్నికలప్పుడు ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చారని అన్నారు.

