- గుట్టుగా గంజాయి అమ్మకాలు
- మత్తులో జోగుతున్న యూత్
- ఉమ్మడి జిల్లాలో పెరిగిపోతున్న నేరాల సంఖ్య
భిక్కనూర్, బతుకమ్మ : కొంతకాలంగా ప్రతి రోజు ఏదో ఒక చోట గంజాయి పట్టుబడిందన్న వార్తలు అయితే వింటున్నాం. కాని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఎప్పటినుంచో గంజాయి వ్యాపారం అంతర్గతంగా జోరుగా సాగుతుండడం,ఆ వ్యాపారాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులకు,ఏదో ఒక రకంగా గంజాయి స్మగ్లర్లు,మాల్ తో పట్టు పడడం,సీజ్ కావడం షరా మామూలుగా మారింది. అయినప్పటికీ అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. పోలీసులకు చిక్కిన మరుసటి రోజు నుంచే ఎక్కడో ఒక చోటుకి ట్రాన్స్ పోర్ట్ అవుతుండడం వలన,ఎంతో మంది యువత ఈ వ్యసనానికి అలవాటు పడి మత్తులో తూగుతున్నారు. మంచి భవిష్యత్తు ఉన్న యూత్ సైతంఈ వ్యసనానికి అలవాటు పడడమే కాకుండా,వ్యాపారం కూడా సాగిస్తున్నారంటే గంజాయి వ్యాపారం,అంతర్గతంగా ఏ రేంజ్ లో సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బయట ప్రపంచానికి తెలియకుండా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిన సంఘటనలు ఉన్నాయి.
- బలయ్యేది యువత గిరిజనులే..
గంజాయి సాగు చేసేది అడవి బిడ్డలే అయినప్పటికీ,సదర్ వ్యాపారంతో లాభం పొందేది మాత్రం మధ్య దళారులు వ్యాపారులే. మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి కొందరు మధ్య దళారులు,వ్యాపారులు ఈ చీకటి వ్యాపారం వలన కోట్ల రూపాయలు కూడబెడుతున్నారు. దొరికితే దొంగ లేకపోతే దొర అన్న చందంగా సాగుతున్న ఈ వ్యాపారంలో అసలు సూత్రధారులు మాత్రం చాకచక్యంగా తప్పించుకుంటున్నప్పటికీ,చిన్నాచితకగా వ్యాపారం సాగించే వారు బలవుతున్నారన్న విషయం ప్రచారంలో ఉంది.
- ఉపాధి అవకాశాలు లేకే..
యువత చెడిపోవడానికి నిరుద్యోగ సమస్యే ప్రధాన కారణం. ఉపాధి అవకాశాలు లేక జల్సాలకు అలవాటు పడిన చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తద్వారా మంచి భవిష్యత్తు ఉన్న యూత్ చేజేతులా పాడు చేసుకుంటున్నారు. గంజాయి సిగరెట్లు ఇతర మత్తుపదార్థాలకు అలవాటు పడుతూ వారంతట వారే వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు. ఇటీవల కొందరు విద్యార్థులు గంజాయి మత్తులకు అలవాటు పడి దొంగలుగా మారి,హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదంటే పరిస్థితి ఏ విధంగా తయారయిందో అర్థమవుతోంది. ఉమ్మడి జిల్లాలో గంజాయి స్మగ్లర్లు పట్టు పడుతుంటే,గంజాయి వ్యాపారం ఏ విధంగా విస్తరించిపోయిందో తెలిసిపోతోంది.
- ఆన్ లైన్ ద్వారా..
గంజాయి వ్యాపారం ఆన్ లైన్ ద్వారా కూడా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ రకాల వాహనాలలో,కూరగాయల గంపల మధ్యలో,ఏ విధంగా అవకాశం దొరికితే ఆ విధంగా,చాలా తెలివిగా గంజాయిని సరఫరా చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ నిఘా ఎక్కువ కావడంతో,గంజాయి వ్యాపారులు కూడా టెక్నాలజీని బాగా ఉపయోగించుకొని కొత్త పుంతలు తొక్కుతున్నారు.
