. 11 కేవీ డీపీ పోల్ డ్యామేజ్ కు రూ.7,600
. ఎల్టీ లైన్ పోల్ కు రూ.16వేలు
నిజామాబాద్, బతుకమ్మ: అడిగినన్ని పైసలు ఇస్తే ఒక తీరు.. ఇవ్వకపోతే మరో తీరుగా పనులు చేయడంలో కరెంటోళ్లు ఆరితేరారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకే సెక్షన్ లోని రెండు ప్రాంతాల్లో వేసిన ఎస్టిమేషన్ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అప్పట్లో అన్నీ తానై నడిపించిన ఉద్యోగి తమ ప్రాంతంలో ఎల్టీ లైన్ స్తంభానికి రూ.16వేలు ఎస్టిమేషన్ వేశారు. ఇంకొకరి విభాగంలో తల దూర్చి 11కేవీ డీపీ పోల్ డ్యామేజ్ అయితే రూ.7,600 వేయించారు.
11 కేవీ పోల్ కు..
టీచర్స్ కాలనీలోని ఓ పాఠశాల వెనుక ఉన్న 11కేవీ డీపీ పోల్ ను భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పోల్ పూర్తిగా డ్యామేజీ కాగా, విరిగిన స్తంభం సరి చేయాలంటే సుమారు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని వాహనదారుడిని భయపెట్టారు. దీంతో వాహనదారుడు తాను అన్ని డబ్బులు ఇచ్చుకోలేనని.. కాస్త చూడాలని బతిమాలడడంతో తమకు అడిగినంత ఇస్తే అన్నీ తామే చూసుకుంటామని విద్యుత్ సిబ్బంది అభయం ఇచ్చారు. ఒప్పందం కుదిరి డబ్బులు అందిన వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ఉన్న 11కేవీ డ్యామేజీ పోల్ కు అతి తక్కువ రూ.7,600 ఎస్టిమేషన్ వేసి పని పూర్తి చేశారు. దీని చెంతనే ట్రాన్స్ ఫార్మర్ ఉండడం గమనార్హం. సిబ్బంది నిర్వాకంతో సంస్థ చాలా నష్ట పోవాల్సి వచ్చిందని పలువురు అంటున్నారు.
ఎల్టీ పోల్ వేయడానికి..
నిత్యం రద్దీగా ఉండే ఆస్పత్రుల ప్రాంతంలో ఎల్టీ లైన్ ఉన్న స్తంభాన్ని డీసీఎం ఢీకొట్టింది. దీనిని సరి చేసేందుకు రూ.15 వేలు ఇవ్వాలని వాహన డ్రైవర్ ను పట్టుకొని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కు చెందిన డ్రైవర్ తనతో అంత మొత్తం కాదని రూ.10వేలు ఇస్తానన్ని ఒప్పుకున్నాడు. ఈ విషయం బయటికి తెలియడంతో విద్యుత్ సిబ్బంది చేసేది లేక అధికారులను తీసుకొచ్చి ఎస్టిమేషన్ వేయించారు. అధికారులు రూ.16వేలు అంచనాగా నిర్ధారించారు. పని పూర్తి కాగానే వాహన డ్రైవర్ ను ఎస్టిమేషన్ డబ్బులు ఇవ్వాలని అడిగితే తాను ఇస్తానని ఒప్పుకుంది రూ.10వేలేనని అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చేది లేదని స్పష్టం చేశాడు. అధికారులు వేసిన ఎస్టిమేషన్ కు డబ్బులు ఎవరూ కట్టలేకపోవడంతో వర్క్ ఆర్డర్ పూర్తి చేయలేకపోయారని తెలుస్తోంది.
