నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్ సిబ్బందికి పెండింగులో ఉన్న వేతనాలు వెంటనే ఇప్పించాలని, కేజీబీవీ సిబ్బందికి ఇస్తున్న పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఉన్న మోడల్ స్కూల్ హాస్టళ్ళల్లో పనిచేస్తున్ననాన్ టీచింగ్, వర్కర్లకు గత 5 నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖలో బడ్జెట్ ఉన్నా, వీరికి వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే వీరికి అతి తక్కువ వేతనాలు ఉన్నాయనీ, అవి కూడా నెలల తరబడి రాకపోవడంతో వారి కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూల్ హాస్టల్స్ ను కేజీబీవీ హాస్టల్స్ గానే పరిగణిస్తున్నారన్నారు. కానీ వీరికి కేజీబీవీ తరహాలో వేతనాలు రావడం లేదన్నారు. ఇప్పటికైనా కేజీబీవీ సిబ్బందికి ఇస్తున్న పద్ధతిలోనే మోడల్ స్కూల్ నాన్ టీచింగ్, వర్కర్లకు పేరోల్ కేటాయించి, వేతనాలు ఇవ్వాలన్నారు. వారు ఇతర సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్, జిల్లా అధ్యక్షులు ఎం.ముత్తెన్న, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు డి.ప్రశాంతి, నాయకులు రజియాబేగం, హారిక, స్వర్ణలత, సత్యశీల, మమత, వాణి, మానస, చిట్టి, సుచేంద్ర, గంగాదేవి, వెంకన్న, రాజేశ్వర్, రమేష్, కిషన్, మురళి పాల్గొన్నారు.

