29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జడలు విప్పిన మట్కా భూతం

Must read

📰 Generate e-Paper Clip

  • ఆర్మూర్ లో ఒకరి ఆత్మహత్య
  • ఆన్ లైన్  లో జోరుగా సాగుతున్న మట్కా దందా
  • నిర్వాహణలో లోకల్ బూకీలదే హవా
  • మట్కా దందాపై పోలీస్ శాఖ చేతులేత్తేసిందా?

నిజామాబాద్ , బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో మట్కా భూతం జడలు విప్పింది. దాని దాటికి కుటుంబాలు చిన్నబిన్నం అవుతున్నాయి. ఒకప్పుడు కేవలం కూలీలు, కార్మీకులకు పరిమితమైన మట్కా ఆన్ లైన్  కావడంతో దాని బారిన పడి సర్వం కోల్పోతున్నారు. ఒకప్పుడు మట్కా బీటర్ (మట్కా చీటీలు) రాసేవారికే పరిమితమైన ఇందూర్ జిల్లా  ఇప్పుడు బూకీలకు కేరాఫ్ ఆడ్రస్ గా మారింది. ఏకంగా బూకీలు చిన్న ఫిగర్ లతో పాటు లక్ష ఫిగర్ లకు ఆన్ లైన్ ఇస్తున్నారు. బహిరంగంగా జరుగుతున్న ఈ దందాతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన గంగామోహన్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో మట్కా భూతం ఎంతలా విస్తరించిందో తెలిసిపోతుంది. కర్ణాటక, మహారాష్ట్రకు సరిహద్దుకు  ప్రాంతమైన ఉమ్మడి  జిల్లాలో ఒకప్పుడు పేకాట కంటే మట్కాకే ప్రసిద్ది. మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ కు వలస వచ్చిన మట్కా ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో ఆన్ లైన్ గేమింగ్ కు కీలకమైంది. మట్కా ఆడేవారితో పాటు ఆడించే వారిపై ఒకప్పుడు షీట్ లు ఓపెన్ చేసేవారు. నిజామాబాద్ జిల్లాలో మట్కా షీట్ లు ఓపెన్ అయిన వారు చాలా  మంది  ఉన్నారు. అయితే ఆన్ లైన్ ముందు వేరు ఆఫ్ లైన్ ముందు వేరని డివైడ్ చేసి మట్కా గురించి తక్కువ  చేస్తూ చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒకప్పుడు  ముంబాయి, హైదరాబాద్, కల్ కత్తా లాంటి ప్రాంతాల పేరు చెప్పి మట్కా నిర్వహించేవారు. అయితే ఇప్పుడంతా ఆన్ లైన్ కావడంతో మొన్నటి వరకు తెలంగాణ సరిహద్దు అయిన నాందేడ్  జిల్లా ధర్మాబాద్ వరకు ప్రధాన బూకీలు అడ్డా వేసుకుని దందా నిర్వహించేవారు. కానీ ఇప్పుడు బూకీలతో పాటు కీలక నిర్వాహకులు అంతా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారేనని మట్కా రాయుళ్లు చెబుతున్నారు. ఆర్మూర్ కు చెందిన గంగామోహన్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆర్మూర్ లో  ప్రధాన మట్కా కింగ్ పేరు బహిర్గతమైంది. దానిపై సోషల్ మీడియాలో ప్రధాన బూకీ ఏజంట్ అంటూ కొందరి పేర్లను చెబుతుంటే ఆర్మూర్ పోలీసులు మాత్రం లైట్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఒక వ్యక్తి మట్కా బానిసై సర్వం కోల్పోయి బలవన్మరణాన్ని పాల్పడితే కనీసం సెక్షన్ లు మార్చి అయిన ఆ కోణంలో విచారణ జరిగితే మట్కా మహమ్మారికి చెక్ చెప్పవచ్చు. కానీ  పోలీసులు సాధారణ ఆత్మహత్యగా కేసులు నమోదు చేయడంతో ఆర్మూర్ లో మట్కా కింగ్ తప్పించుకునేందుకు అవకాశం ఇచ్చినట్లయింది. నిజామాబాద్ లోనూ మట్కా జోరుగా సాగుతుంది. బోధన్, నవీపేట్ తో పాటు కామారెడ్డి  జిల్లాలోనూ మట్కా జోరుగా ఆడిస్తున్నారు ప్రధాన బూకీలు. ఇక్కడే నిత్యం లక్షల రూపాయలు చేతులు మారుతుంటే పోలీసు శాఖ కేవలం పేకాట  పై మాత్రమే నజర్ వేయడంతో మట్కా విస్తరణకు అడ్డుకట్ట పడడం లేదు. నిజామాబాద్ కొత్వాల్ లేకపోవడంతో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉండగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట విషయం దేవుడెరుగు అన్న పరిస్థితి దాపురించింది. ఇంచార్జి అధికారులు సీరియస్ గా తీసుకోకపోవడంతో స్థానికంగా ఉన్న పోలీసులకు  ఏజంట్లు, బూకీలు మామూళ్ళతో సరిపెడుతున్నారని చెప్పాలి. మట్కా ఏజంట్లు, బూకీలు మిలాఖత్ కావడంతోనే షీట్ లు ఉన్నా ఇప్పటికి మట్కా దందా మాత్రం నిరాటకంగా సాగిస్తున్నారని విమర్శలు, ఆరోపణలున్నాయి.

More articles

Latest article