24.8 C
Hyderabad
Friday, July 31, 2026

రెండు సబ్ స్టేషన్ లలో ఇద్దరే..

Must read

📰 Generate e-Paper Clip

  • అంత్యక్రియలకు అనుమతి ఇవ్వలేదు
  • సెలవు ఇవ్వరు – ప్రత్యామ్నాయం చూపరు
  • ఫోన్లు ఎత్తరు, పట్టించుకోరు
  • మోర్తాడ్ సబ్ డివిజన్ లోని అధికారుల తీరిది

 

నిజామాబాద్, బతుకమ్మ: సార్ మా అమ్మమ్మ చనిపోయింది. చివరి చూపు కోసం వెళ్తాను, సెలవు ఇవ్వండి అని సబ్ స్టేషన్ లో పని చేసే అర్టిజన్ ఏఈకి పలుమార్లు ఫోన్ చేసాడు. అటు నుంచి సమాధానం లేదు సరిగదా సెలవు సైతం లేదు ..చేసేదిలేక కన్నీళ్ళపర్యంతమై మౌనంగా రోదిస్తూ విధులు నిర్వహించుకున్నాడు. కనీసం దినకర్మకైనా వెళ్తాను అని వేడుకోగా చివరకు ఒక్కరోజు కోసం ముష్టి వేసినట్లు సెలవు ఇచ్చారు. ఈ సంఘటన మోర్తాడ్ సబ్ డివిజన్ లోని దోన్పాల్ గ్రామంలో గల సబ్ స్టేషన్ లోనిధి. వినడానికి ఏవగింపుగా ఉన్నా.. పని చేసే వారికి తెలుస్తుంది ఆ వేధనేంటో.. దీనిలో ఇద్దరు అర్టిజన్లు, ఒక లైన్ మెన్ ఉండాలి. ఇక్కడ అర్టిజన్ తోపాటు లైన్ మెన్ ఉన్నాడు. సబ్ స్టేషన్ నిబంధనల ప్రకారం నలుగురు పనిచేయాల్సి ఉంటుంది. సిబ్బంది తక్కువగా ఉన్నారని ముగ్గిరికి కుదించారు. మోర్తాడ్ సబ్ డివిజన్ లో మాత్రం ఇద్దరితోనే సబ్ స్టేషన్లు నడుస్తున్నాయి. ఒకటి దోన్పాల్ లో, మరోకటి తడపాకల్ లో… శక్తికి మించిన పని భారం ఇద్దరిపై పడుతున్న విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.

  • సెలవులు లేవు ….

మంచి, చెడు కార్యక్రమాలకు వెళ్ళాల్సి వస్తే సెలవులు లేని సబ్ స్టేషన్లు ఇవి. అత్యవసరం ఉందని స్థానిక ఏఈకి, ఏడిఈకి ఫోన్ చేస్తే ఎత్తరు, తిరిగి చేస్తారంటే అధీ లేదు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో బిక్కమొహం వేసుకొని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఆ సబ్ స్టేషన్ వారికి ఏర్పడుతోంది. మనిషికి 15 రోజుల చొప్పున ఇద్దరు సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఉన్న ఒక లైన్ మెన్ సబ్ స్టేషన్ ఆపరేటర్ గా చేయాలా లేక ఊరిలో కరెంట్ కష్టాలు చూడాలా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

  • చూపని ప్రత్యామ్నాయం….

ఆ రెండు గ్రామాల్లోని సబ్ స్టేషన్ లలో ఇద్దరే ఉన్నారని తెలిసిన ఏఈలు, ఏడిఈ పట్టించుకోవడం లేదంటే వారికి విధులు, సిబ్బంది పట్ల అంకిత భావం ఏపాటిదో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మనిషికి ఏదో రూపంలో పని పడుతుంది. ఇలాంటి సమయాలలో సెలవులు ఇవ్వకపోతే మనోవేధనల భారినపడి జరగరానిది జరిగితే బాద్యులు ఎవరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. క్లిష్ట సమయంలోనైనా అదనపు ఉద్యోగిని సర్దుబాటు చేయలేకపోతున్నారు. సబ్ స్టేషన్ లలో సిబ్బంది కావాలని పై అధికారుల వద్ద అడిగిన దాఖలాలు లేవని తెలుస్తోంది.

  • ఫోన్లు ఎత్తని అధికారులు ….

విధుల విషయంలో ఆటుపోట్లు ఎదురైతే ముందుగా తనపై ఉన్న అధికారికి సమాచారం చేరవేస్తారు. అందుబాటులో లేనట్లయితే కాస్త పై అధికారికి ఫోన్ చేస్తారు. మోర్తాడ్ సబ్ డివిజన్ లో ఏఈలు, ఏడిఈ ఫోన్ ఎత్తరనే ఆరోపణలు ఉన్నాయి. వీరి స్వంత నంబర్లకు గాకుండా సంస్థ వాటికి చేసిన సమాధానం ఇవ్వరనే ప్రచారం ఆ సబ్ డివిజన్ లో జరుగుతోంది. సిబ్బందిని సర్దుబాటు చేయండని అధికారిని అడిగితే తాను కొత్తగా వచ్చానని చెప్పడం హాస్యాస్పదంగా మారింది.

  • యూనియన్లు ఉన్న ఉత్తదే….

సిబ్బందికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన యూనియన్ నాయకులు వారి స్వలాభం కోసమే పని చేసుకుంటున్నట్లు కనబడుతోంది. మారుమూల ప్రాంతాల్లో పని చేయరు, చేసే వారికైనా ఇబ్బందులు ఎదురైతే తీర్చేలా లేరు, కష్టాల్లో తోడు ఉండరు. అదనపు పని భారం నుంచి విముక్తిని కలిగిద్దామనే సంకల్పం యూనియన్ నాయకులలో కనిపించడం లేదు. ఎక్కడేమి దొరుకుతుందా అని వెంపర్లాడడమే తప్ప, సబ్ స్టేషన్ లలో పూర్తి స్థాయి సిబ్బందిని ఉండేలా చూసేందుకు అధికారులను నిలదీసే సాహసం చేయలేకపోతున్నారనే విమర్శలు సంఘాల సభ్యుల నుంచి వినిపిస్తున్నాయి.

More articles

Latest article