- ఆ ఎస్సైల ఇష్టారాజ్యం
- సివిల్ వివాదాలకు అడ్డాలు ఆ స్టేషన్ లు
- ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరిపై అనేక ఆరోపణలు
- ఠాణాలకు వెళ్లేందుకు జంకుతున్న బాధితులు
నిజామాబాద్, బతుకమ్మ: కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్సైల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. పోలీస్ స్టేషన్ లను పంచాయితీలకు అడ్డాలుగా మారుస్తున్న ఎస్సైలు.. హత్యలను ఆత్మహత్యలుగా, క్రిమినల్ కేసులను సివిల్ పంచాయితీలుగా మారుస్తూ ‘రూల్’ చేస్తున్నారు. ఓ ఎస్సై రియల్టర్లతో దోస్తీ చేస్తూ సెటిల్ మెంట్లు చేస్తుండగా, మరో ఎస్సై సొంతంగా ఇసుక దందా చేస్తున్నాడు. ఇంకో ఎస్సై ఫిర్యాదు ఏదైనా దానిని పంచాయితీ చేసి వసూళ్లకు పాల్పడుతున్నాడు. సీపీగా కల్మేశ్వర్ పని చేసిన సమయంలో ఇసుక అక్రమ రవాణా, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్సైలపై శాఖాపరమైన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. పూర్తిస్థాయి సీపీ ఉన్న సమయంలోనే ఎవరి మాటా వినని ఎస్సైలు, ప్రస్తుతం ఇన్ చార్జి సీపీ కొనసాగుతుండడంతో అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు.
- ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఏదైనా పంచాయితీనే..
మోపాల్ పోలీస్ స్టేషన్ కు ఏ ఫిర్యాదు వెళ్లినా అక్కడి ఎస్సై పంచాయితీ చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. బాధితులు బహిరంగంగానే ఎస్సైని నిలదీస్తుండడం, దానికి ఆయన చర్యలు తోడుకావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. సివిల్ పంచాయితీలకు మోపాల్ పోలీస్ స్టేషన్ను అడ్డాగా మార్చారని అంటున్నారు. ఓ గ్రామంలో దొంగతనంగా చేపలు వేటాడేందుకు వెళ్లిన వ్యక్తిని పలువురు పట్టుకుని దాడి చేయగా అతడు మృతి చెందాడని, దాడి చేసిన వ్యక్తులు మృతదేహానికి ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరగా, ఆత్మహత్య కేసుగా నమోదు చేసి నిందితులను తప్పించారనే ఆరోపణలున్నాయి. అలాగే ఇటీవల ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న 13 ఎకరాల భూ వివాదంలో తల దూర్చిన ఎస్సై ‘సెటిల్’ చేసుకోవాలని బాధితులనే బెదిరించడం గమనార్హం. సుమారు 40 నుంచి 50 మంది కలిసి భూమి యజమానితో పాటు డ్రైవర్ పై దాడి చేయగా బాధితులు మోపాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటికే అవతలి పార్టీతో మిలాఖత్ అయిన ఎస్సై పరస్పర దాడులంటూ కేసులు నమోదు చేశారు. వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ సెటిల్ చేసుకోవాలని మాటిమాటికీ తమకు ఎస్సై ఫోన్ లు చేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికే ఎస్సై పై ఇంచార్జి కమిషనర్ కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇక కోర్టు ధిక్కరణ కేసు తెరపైకి తీసుకువచ్చనట్లు సమాచారం.
- ఇసుకాసురుడు ఆ ఎస్సై..
జేసీబీలు, ట్రాక్టర్లను పెట్టి తన మనుషుల ద్వారా ఇసుక అక్రమరవాణా చేస్తున్న ఇందల్ వాయి ఎస్సై మనోజ్ వ్యవహారశైలి సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తులు ఏకంగా ఐజీకి ఫిర్యాదు చేశారు. నల్లవెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బుల వ్యవహారంలో తలదూర్చిన మనోజ్ అకారణంగా ఒకరిపై దాడి చేయగా, సదరు వ్యక్తి తిరిగి ఎస్సైపై దాడి చేశారు. ఇదంతా పోలీస్ స్టేషన్ లో అందరి ముందు జరగడం విశేషం. నల్లవెల్లి గ్రామానికి చెందిన రైతుల వివాదంలో తలదూర్చిన మనోజ్ వారి నుంచి రూ.50వేలు వసూలు చేసినట్లు తెలిసింది. అలాగే మట్టి తరలించే ట్రాక్టర్ల యజమానులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తుండడంతో రైతులు, ప్రజలు ఎస్సైపై తిరబడే పరిస్థితులున్నాయి. ఎస్సై మనోజ్ వ్యవహారశైలితో విసుగుచెందిన మండల ప్రజలు ఏ క్షణాన ఏకమవుతారో.. ఆ తరువాత పరిణామాలు ఏమిటో అనేది చర్చనీయాంశమైంది.
- ప్యాకేజీల ఎస్సై
భీమ్ గల్ పోలీస్ స్టేషన్ ఎస్సైకి ప్యాకేజీల అధికారిగా ప్రత్యేక గుర్తింపు లభించింది. కేసు ఏదైనా కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తూ ప్యాకేజీలు మాట్లాడుకోవడం ఆయన ప్రత్యేకత అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేసును బట్టి రేటు మాట్లాడుకుంటూ దండుకుంటున్నట్లు సమాచారం. ఇసుక, పీడీఎస్ బియ్యం ఇలా ఇన్ కమ్ జనరేట్ చేసే మార్గాలపై కన్నేసిన ఎస్సై వాందరినీ తన దారిలోకి తీసుకువచ్చి డీల్ చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
- ఆ ఎస్సై కనుసన్నుల్లోనే హద్దులు దాటుతున్న ఇసుక
బోధన్ సబ్ డివిజన్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్సై కనుసన్నుల్లో ఇసుక తరలిపోతుంది. పోలీస్ స్టేషన్ ముందు నుంచే రాత్రి అయిందంటే ఇసుక తరలిస్తున్నారు ఇసుకాసురులు. సంబంధిత ఎస్ హెచ్ వో ఆదేశాల మేరకు ఇసుక మాఫియాతో లోపాయికారి ఒప్పందం ఉందని అంతా కోడై కూస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్ మీదుగా తరిలే ఇసుక విషయంలో పలు వివాదాలు, ఘర్షణలు జరిగినా పోలీసులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సదరు ఎస్సై వెనుక డివిజన్ కు చెందిన కొందరు పెద్ద అధికారులు ఉండడంతో ఎస్సై ఎవ్వరిని ఖతారు చేయకుండానే ఇసుక దందాలో తలమునకలై ఉన్నాడని చెప్పాలి.
