28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

భారీ వెంచర్ లో భాగోతాలెన్నో..

Must read

📰 Generate e-Paper Clip

      ప్రభుత్వ భూములను మింగిన ‘రివర్ ఎడ్జ్’

      వెంచర్ లోని 10శాతం భూమి ప్రభుత్వానిదే..

      ఎండోమెంట్ భూముల్లో ప్లాట్లు.. విక్రయం

      పరేషాన్ లో కొనుగోలుదారులు

నిజామాబాద్, బతుకమ్మ: నగరానికి ఆనుకుని వెలిసిన రివర్ ఎడ్జ్ వెంచర్ భాగోతాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్లుగా చేసి విక్రయించిన రియల్టర్లు తేలు కుట్టిన దొంగల్లా బయటికి రావడం లేదు. మరో వైపు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ పరిస్థితి ఏమిటి? ఎవరికి చెప్పుకోవాలని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేవాదాయశాఖ అధికారులు తమ శాఖ భూమిని గుర్తించి హద్దులు పాతినప్పటికీ వెంచర్ యజమానులు బయటికి వచ్చి ప్లాట్ల కొనుగోలుదారులకు సమాధానం చెప్పింది లేదు.  మానిక్ బండార్ శివారులో అధికారికంగా 216 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేయదల్చిన రియల్టర్లు దేవాదాయ ధర్మాదాయశాఖ, ఇరిగేషన్ భూములను ఆక్రమించి 300 విస్తీర్ణానికి చేర్చి ప్లాట్లు చేశారు. సర్వే నంబర్ 499లో 30గుంటలు, 480లో 14 గుంటలు, 477లో 2 ఎకరాల 5గుంటలు, 503లో 19 గుంటలు, 548లో 29గుంటల దేవాదాయ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించి హద్దులు పాతారు. ఆ భూముల్లో ప్లాట్లు చేసి విక్రయించిన వారు మాత్రం ఇప్పటికీ బయటికి రాకపోవడం గమనార్హం.

సర్వే నంబర్ 485లో భూమిని మింగి..

వెంచర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసిన సమయంలో రియల్టర్లు సర్వే నంబర్ 485లోని 13గుంటల  ప్రభుత్వ భూమిని ఎండోమెంట్ భూమిగా చూపారు. ఆ తరువాత ఆ అదే భూమిలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. అయితే తమశాఖ పరిధిలోని భూమిని గుర్తించిన ఎండోమెంట్ అధికారులు 485 సర్వే నంబర్ లోని 13గుంటల భూమి జోలికి మాత్రం వెళ్లలేదు. ఆ 13 గుంటల భూమిని ఏ శాఖ స్వాధీనం చేసుకుంటుంది? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది.

బఫర్ జోన్ పై భిన్న వాదనలు

ఫూలాంగ్ వాగును ఆనుకుని ఏర్పాటు చేసిన భారీ వెంచర్ కు ‘రివర్ ఎడ్జ్’ అని పేరు పెట్టారు. దానికి అనుగుణంగానే వెంచర్ అనుమతుల దరఖాస్తు సమయంలో 30 మీటర్ల వరకు బఫర్ జోన్ గా రియల్టర్లు చూపారు. ఫిర్యాదుల అనంతరం స్పందించిన అధికారులు వచ్చి కేవలం 10 మీటర్లే బఫర్ జోన్ అని చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. వెంచర్ యజమానులే 30 మీటర్ల వరకు బఫర్ జోన్ అని చెబుతుండగా, అధికారులు మాత్రం 10 మీటర్లే అని బహిరంగంగా చెప్పడం గమనార్హం.

బయటికి రాని యజమానులు

రివర్ ఎడ్జ్ పై అనేక ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి ప్రభుత్వ భూములను గుర్తిస్తూ హద్దులు పాతుతున్నా వెంచర్ యజమానులు మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు.  ప్లాట్లు కొనుగోలు చేసిన వారు మాత్రం తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.

More articles

Latest article