25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్మూర్ కు అష్టదరిద్రాలు కాంగ్రెస్, బీజేపీ

Must read

📰 Generate e-Paper Clip

– మచ్చర్ల లిఫ్ట్ కేసీఆర్ గిఫ్ట్

– లిఫ్ట్ ల పనులను వేగవంతం చేయాలి

– లేనిపక్షంలో వెంటాడి చేయిస్తాం

– గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే తెచ్చిన నిధులు నిల్.. ఓడిన కాంగ్రెస్ నేత అవినీతి ఫుల్

– బీఆర్ఎస్ హయాంలోనే లిఫ్ట్ లు మంజూరు

– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఆర్మూర్, బతుకమ్మ:  రైతుల చిరకాల వాంఛ అయిన మచ్చర్ల లిఫ్ట్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మచ్చర్ల లిఫ్ట్ పనులను బుధవారం ఆయన పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఆర్మూర్ నియోజక వర్గానికి  మంజూరైన మూడు కొత్త లిఫ్ట్ లు బీఆర్ఎస్ ఇచ్చినవేనని స్పష్టం చేశారు. మచ్చర్ల, జోర్ పూర్, కుద్వాన్ పూర్ గ్రామాల రైతులకు చెందిన 2,860 ఎకరాల భూమిని సాగులోకి తెచ్చేందుకు మచ్చర్ల లిఫ్ట్ కు రూ.40 కోట్లు, ఫత్తేపూర్, చేపూర్,  సుర్బిర్యాల్ లిఫ్టుకు రూ.110 కోట్లు, చిక్లీ-గుంజ్లి లిఫ్ట్ కు రూ.89 కోట్లను తానే మంజూరు చేయించానని జీవన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైందనే అక్కసుతో మచ్చర్ల లిఫ్ట్ పనులను గతేడాది కాలంగా చేపట్టడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన లిఫ్ట్ లను కూడా తామే మంజూరు చేయించామని చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాను రెండో దఫా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మచ్చర్ల లిఫ్ట్ కు రూ.40 కోట్లు మంజూరయ్యాయని,  కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ కూడా జరిగిందని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ లిఫ్ట్ బీఆర్ఎస్ హయాంలో వచ్చిందనే అక్కసుతో ఏడాది కాలంగా పనులు చేపట్టకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఆర్మూర్ పాలిట అష్టదరిద్రాలుగా మారాయని ఆయన మండిపడ్డారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే తెచ్చిన నిధులు నిల్ అని, ఓడిన కాంగ్రెస్ నేత అవినీతి ఫుల్ అని, ఈ రెండు పార్టీల పుణ్యమా అని ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కిల్ అని ఆయన ధ్వజమెత్తారు. ఆర్మూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ హయాం స్వర్ణ యుగమని, కాంగ్రెస్, బీజేపీ లు రాతి యుగం తెచ్చాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ చేసింది శూన్యమన్నారు. ఇప్పటికైనా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిపై శ్రద్ద పెట్టాలని, లిఫ్ట్ ల పనులు వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే  తామే వెంటాడి చేయిస్తామని హెచ్చరించారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదని, కాంగ్రెస్, బీజేపీ లని వెంటాడి తీరుతామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

More articles

Latest article