
. గ్రామంలో వందకుపైగా ట్రాక్టర్లు
. సొంతవి లేకపోతే లీజుకు తీసుకువస్తున్న వైనం
కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించెల్లి గ్రామం కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జాతర సాగుతోంది. ఈ ఒక్క గ్రామంలోనే వంద ట్రాక్టర్లు ఉండడం, సొంత ట్రాక్టర్లు లేని వారు లీజుకు తీసుకువస్తుండడం ఇసుక అక్రమరవాణాకు అద్దం పడుతోంది. తహసీల్దార్ ను మచ్చిక చేసుకుని ప్రభుత్వ పనుల పేరిత అనుమతులు పొందుతున్న వారు మంజీర నుంచి ఒకే వే బిల్ తో ఐదు ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరైతే ఏకంగా రెండు చొప్పున ట్రాక్టర్లను మెయింటెయిన్ చేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లు రాకపోకలు సాగించే రోడ్డులో బాన్సువాడ నుంచి బీర్కుర్ కు ప్రయాణించాలంటేనే జనాలు జకుంతున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు అతివేగం, అజాగ్రత్తగా రాకపోకలు సాగిస్తుండడంతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఓ వైపు ఇసుక అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా, ట్రాక్టర్ల కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుని ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. జిల్లాస్థాయి అధికారులు ఇటువైపు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

