. యథేచ్ఛగా రోడ్డు కబ్జా
. చర్యలు తీసుకోవాలని నాటి స్పీకర్ ఆదేశించినా కన్నెత్తి చూడని అధికారులు
రుద్రూర్, బతుకమ్మ: వర్ని – కోటగిరి మండలాలను కలిపే 40 ఫీట్ల రోడ్డు 15 ఫీట్లుగా మారింది. వ్యవసాయ భూముల్లో నుంచి ఉన్న ఈ రోడ్డును యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కొంత మంది రోడ్డును కబ్జా చేస్తూ ఏకంగా వరి నాట్లు వేస్తున్నారు. వర్ని, కోటగిరి మండలాలను కలిపే ప్రధాన రహదారి అంబం, చిక్కడపల్లి మీదుగా సులేమాన్ నగర్ కి వెళ్లే రహదారి ఇది. స్పీకర్ హోదాలో గతంలో చిక్కడపల్లికి గ్రామానికి వచ్చిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి రోడ్డు కబ్జాపై ఫిర్యాదు చేయగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో రూ.72 లక్షలు వెచ్చించి అంబం నుంచి భారత్ కేసీ ఫారం వరకు సీసీ రోడ్డు వేశారు. మరో 900 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే చిక్కడపల్లి గ్రామం వరకు రోడ్డు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుంది. చిక్కడపల్లి గ్రామస్తుల ప్రకారం నిజాంసాగర్ కెనాల్ మధ్య నుంచి 100 ఫీట్లు కెనాల్ బౌండరీ ఉండేదని, దాని పక్కన రోడ్డు మరో 34 ఫీట్లు ఉండేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాకు గురైన రోడ్డును గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

