నిజామాబాద్ సిటీ/ధర్పల్లి, బతుకమ్మ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతులను కాపాడాలని కోరుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ నాయకులు జిల్లా కేంద్రంతోపాటు ధర్పల్లిలో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తోందని, దళిత, గిరిజనులు తీవ్ర అణిచివేతకు గురవుతున్నారన్నారు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని లగచర్లలో పేద రైతుల భూములను బలవంతంగా లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైలులో పెట్టారన్నారు. రైతులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో నిజామాబాద్ నగర మేయర్ నీతూకిరణ్, జడ్పీ మాజీ చైర్మన్ విఠల్ రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు తదితరులు పాల్గొన్నారు.

